తప్పుడు తూకాలతో ప్రజలను దండుకుంటున్న కొందరు వ్యాపారులు
తక్కెడలు, డిజిటల్ వెయింగ్ స్కేల్స్‌లో మార్పులు చేసి ప్రతి కిలోపైనా 200 గ్రాముల దాకా మోసాలు
కొన్ని పెట్రోల్ బంకుల్లోనూ ప్రతి లీటర్‌పై 200 ఎంఎల్ వరకు కొట్టేస్తున్న మాయగాళ్లు
కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నా తీరు మార్చుకోని వైనం
కొనుగోళ్లు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: కూరగాయలు సహా నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఓవైపు అల్లాడుతుంటే మరోవైపు కొందరు వ్యాపారులు మాత్రం తూకాల్లో మోసాలతో ప్రజలను మరింత గుల్ల చేస్తున్నారు. తక్కెడలు, డిజిటల్ తూకాల్లో ప్రతి కిలోపైనా 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు నొక్కేస్తున్నారు. అలాగే కొన్ని పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ డిస్పెన్సర్‌ల నుంచి తక్కువ పెట్రోల్ వచ్చేలా మైక్రోకంట్రోలర్ల (చిప్‌లు)లో మార్పులు లేదా రిమోట్ ఆపరేటింగ్ ద్వారా ప్రతి లీటర్‌పైనా సుమారు 200 మిల్లీలీటర్ల వరకు కొల్లగొడుతూ మోసాలకు పాల్పడుతున్నారు.
తూనికలు–కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నా ఆయా వ్యాపారుల తీరు మాత్రం మారడంలేదు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు 2022–23లో 8,498 కేసుల్లో రూ. 6.41 కోట్ల మేర, 2023–24లో 9,055 కేసుల్లో రూ. 7.09 కోట్ల మేర, 2024–25లో 8,538 కేసుల్లో రూ. 6.36 కోట్ల మేర జరిమానాలు విధించారు.
రాష్ట్రంలో 2022–23లో 281 ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ పరిష్కరించిన అధికారులు 2024–25లో వచ్చిన 621 ఫిర్యాదుల్లో 567 పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇలా చేద్దాం...
» నిత్యావసర వస్తువులు కొనేటప్పుడు వాటిపై ప్యాకేజీ తేదీ, చిరునామా, బరువు, కొలతను చూడాలి. వాటిని అక్కడే ఒకసారి తూకం చేసి బరువును నిర్ధారించుకోవాలి.
» వస్తువులపై ముద్రించి ఉండే గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)కన్నా అధికంగా వసూలు చేసే వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలి.
» ఒక్కోసారి కొందరు వ్యాపారులు వస్తువుల ముద్రిత ధరలు కనిపించకుండా అధిక ధరల స్టిక్కర్లు అతికిస్తుంటారు. అలాంటి వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) మొబైల్ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయొచ్చు. 1915, 1800114000 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా సమస్యలను తెలియజేయవచ్చు.
» ఏదైనా వస్తువు కొనేటప్పుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చే ఇన్వాయిస్, ఐడీలను భద్రంగా ఉంచుకోవాలి.
» మోసాల్లో ఆరితేరిన వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక నిఘా పెట్టాలి. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయాలి.
» తూకాల్లో మోసాలపై ప్రజలకు సంతలు, మార్కెట్ యార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.


