స్థానికంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఫ్యామిలీ స్కెచ్‌లు అనేకం ఉంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అన్నట్టుగా పక్కా ప్రణాళికతో ఎన్నికల బరిలో నిలుస్తారు. నామినేషన్లు ఎక్కడా రిజెక్ట్ కాకుండా పెద్ద కసరత్తే చేస్తారు. ఒకవేళ నామినేషన్ రిజెక్ట్ అవుతుందోనని భావించి తమ కుటుంబసభ్యులతో కూడా ఒకటి రెండు నామినేషన్లు వేయిస్తారు. అన్నీ పక్కాగా ఉంటే మరొకరి నామినేషన్ విత్ డ్రా చేయిస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే మరొకరు పోటీలో ఉంటారు.
బండి కాని...బండి
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ఆటోకు రెండు బండి చక్రాలను జోడించి ఎడ్ల బండి మాదిరిగా తయారు చేయించారు. ముందు రెండు ఎడ్ల బొమ్మలను, వెనకాల ఆవు దూడలను జోడించి అందరినీ ఆకట్టుకునేలా తయారు చేయించారు.
ఓటరులో చైతన్యం
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పలువురు మహిళలు.. ‘మా ఓట్లను మద్యానికి, డబ్బులకు, బహుమతులకు అమ్ముకోము. నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకుంటాం’అని పలకలపై రాసి తమ ఇంటి గేటుకు పెట్టుకున్నారు.
మాజీమంత్రి తండ్రి సర్పంచ్‌గా పోటీ
తిరుమలగిరి: మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా పోటీలో ఉన్నారు. 95 సంవత్సరాల వయసున్న రామచంద్రారెడ్డి బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో నిలిచారు. గతంలో జగదీశ్‌రెడ్డి సోదరుడు రమేశ్‌రెడ్డి భార్య మాణిమాల నాగారం మండలం డి.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది నాగారం వైస్ ఎంపీపీగా పనిచేశారు.
హామీలు పూర్తి చేయకపోతే చెప్పులు మెడలో వేసుకుంటా
బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
మానకొండూర్: ‘తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకపోతే ప్రతీకులానికో చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతా’అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి అభయం ఇచ్చారు. ఇందుకోసం రూ.వంద విలువైన బాండ్‌పేపర్‌పై హామీలను రాసిచ్చారు. డబ్బులు, మద్యం పంచకుండా తనలాగే మేనిఫెస్టో విడుదల చేసి కేవలం ఓట్లు అడగాలని తన ప్రత్యర్థులను వేడుకున్నారు.
ఆ ముంపు గ్రామాలకు ఇవే చివరి ఎన్నికలు
సాక్షి, యాదాద్రి: భువనగిరి మండలం పరిధిలో నిర్మిస్తున్న నృసింహ సాగర్ (బస్వాపురం) రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భువన గిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్‌తండా, తుర్కపల్లి మండలం చౌక్లాతండా గ్రామ పంచాయ తీలకు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ప్రభుత్వం సకాలంలో పరిహా రం చెల్లించకపోవడంతో ప్రజలు ఆ గ్రామాలను ఇంకా ఖాళీ చేయలేదు. దీంతో అక్కడే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
లప్పానాయక్‌తండా సర్పంచ్ పదవితో పాటు 8 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. చౌక్లాతండా సర్పంచ్‌గా రాజారాంనాయక్‌తోపాటు 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తిమ్మాపురం సర్పంచ్‌గా ఎడ్ల వెంకట్‌రెడ్డి, 1,3, 4, 7, 9 వార్డులు ఏకగ్రీవంగా కాగా, 5 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
చట్టప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం
ముంపు గ్రామాలకు చట్ట ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తాం. ముంపు తర్వాత గ్రామాన్ని ఎక్కడకు మార్చాలన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఐదేళ్ల కాలానికి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. ముంపు గ్రామాల్లో పక్కా నిర్మాణాలు కొత్తగా చేపట్టం. – విష్ణువర్ధన్ రెడ్డి, డీపీఓ
భర్త నామినేషన్ రిజెక్ట్.. భార్య అభ్యర్థిత్వానికి ఓకే
స్కూల్ అసిస్టెంట్, అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు వదిలి...
ఇబ్రహీంపట్నం రూరల్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్‌లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ బింగి రాములయ్య ఓ రాజకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. మరో పది నెలల సర్వీస్ ఉండగానే వీఆర్‌ఎస్ కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 30న తన రాజీనామా పత్రాన్ని డీఈఓ సుశీందర్‌రావుకు అందజేశారు. రాములయ్య సతీమణి బింగి గీత సైతం ఇదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఈనెల 5న తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పీడీకి లేఖ అందజేశారు. అనంతరం ఆమె కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గీత రాజీనామాకు సంబంధిత శాఖ నుంచి ఎన్‌ఓసీ జారీ కాగా, ఆమె అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. కానీ, విద్యాశాఖ నుంచి రాములయ్యకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది.


