రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్
నూతన లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తెస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్, దాని అనుబంధ కార్మిక విభాగం బీఆర్‌టీయూ సిద్ధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కార్మిక సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా తాము కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు.
ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశి్నస్తూ, నూతన లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించిన కేటీఆర్, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, మన దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
చైనా ఆర్థిక వ్యవస్థతో పోల్చుతూ, నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, కానీ నేడు అది 60 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భారత్ మాత్రం ఇంకా 4 ట్రిలియన్ల వద్దే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. చైనా తన ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకుంటూ, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ మద్దతునిస్తూ, లాభాల్లో ఉన్నప్పుడు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించిందని కేటీఆర్ చెప్పారు.
కాగా, ఈ నూతన లేబర్ కోడ్‌లను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో తదుపరి సమావేశం నిర్వహిస్తామంటూ కార్యాచరణను కేటీఆర్ ప్రకటించారు.
కార్పొరేట్ ఏకాధిపత్యం ప్రమాదకరం..
దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకాధిపత్యం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని కేటీఆర్ ఉదహరించారు. ఇది ముమ్మాటికీ శ్రమ దోపిడీ వల్లే జరిగిందని, అయినా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేయకుండా ఆ సంస్థ ఒత్తిడికి తలొగ్గిందని విమర్శించారు.


