నల్లగొండ ప్రజల ఫ్లోరైడ్ బాధ తీరుస్తాం
మామా, అల్లుళ్లు సాగర్, శ్రీశైలంలో దూకినా పనులు ఆపం
కేసీఆర్ కుటుంబం 4.5 కోట్ల మందిని దోచుకుంది.. అయినా వారి ఆకలి తీరలేదు
వారికి మళ్లీ అవకాశమిస్తే ముంచే రోజులు వస్తాయి
బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్న బియ్యం ఇస్తున్నారా?
దేవరకొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ బాధ తీర్చేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులతోపాటు డిండి ప్రాజెక్టును ఈ టర్మ్‌లోనే పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. 2005లో రూ. 2 వేల కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రారంభించి 30 కిలోమీటర్ల మేర తవ్వితే.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ ప్రజలపై కక్షగట్టి ఎస్‌ఎల్‌బీసీని పడావుబెట్టారని ఆయన దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వచ్చాక 3.40 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభించామన్నారు. కానీ ప్రమాదవశాత్తూ సొరంగం కుప్పకూలి 8 మంది చనిపోతే ప్రాజెక్టు ఆగిపోతుందని మామా అల్లుళ్లు పైశాచిక ఆనందం పొందుతూ డ్యాన్సులు చేస్తున్నారని కేసీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి దుయ్యబట్టారు. ‘మీరు బండ కట్టుకొని సాగర్‌లో లేదా శ్రీశైలంలో దూకినా మీ శవాలను వెతికిస్తాం తప్ప ఎస్‌ఎల్‌బీసీ, డిండిని ఆపకుండా ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తాం. అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్ల పనులను కూడా పూర్తి చేసి తీరుతాం. సాగునీటి శాఖ మంత్రి ఈ జిల్లావాసే. అందుకే ప్రాజెక్టులకు నిధులను నీళ్లలా పారించి పూర్తి చేస్తాం’అని రేవంత్ చెప్పారు.
రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు..
గడీల పాలనను కుప్పకూల్చి ప్రజాపాలనను, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు ప్రజల సహకారమే తోడ్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రెండేళ్ల ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అప్పుల తెలంగాణగా, నిరంకుశ పాలనగా మార్చి నాలుగున్నర కోట్ల మంది ప్రజలను దోచుకుతిన్నారని ఆరోపించారు. సర్పంచులు, నలుగురు వార్డు మెంబర్లతో కూర్చొని మంచి రోజులు వస్తాయని అంటున్నారని.. ఆయన దీనావస్థ చూస్తే జాలేస్తోందన్నారు.
నాడు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ వంటి మంత్రులను ప్రగతి భవన్‌లోకి రాకుండా గెంటేసి నేడు సర్పంచ్‌లను పిలిపించుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణాను దోచుకుందని.. ఆయన, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు కలిసి నాలుగు వైపులా పీక్కుతిన్నారని సీఎం ఆరోపించారు. అయినా వారి ఆకలి తీరలేదని.. వారికి అవకాశం వస్తే రాష్ట్రాన్ని మళ్లీ ముంచే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఆయన కొడుకే ఒక గుదిబండ అని.. ఆ బండ ఉన్నంతసేపు ఆయన పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొంద పెట్టారని చెప్పారు.
దేశంలోకెల్లా సన్న బియ్యం తెలంగాణలోనే..
పదేళ్ల పాలనలో పేదవాడికి రేషన్‌కార్డు ఇవ్వాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండాపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. తాము వచ్చాకే కొత్త కార్డులు, ప్రస్తుత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులకు అవకాశం కల్పించామని చెప్పారు. నాడు దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపు వారికే అమ్ముకునే వారని.. తాము అధికారంలోకి వచ్చాక 3.10 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని రేవంత్ వివరించారు. సన్న బియ్యం పంపిణీ దేశంలో మరెక్కడా లేదన్నారు. ప్రధాని మోదీ పాలించిన గుజరాత్‌లో లేదని, ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్న బియ్యం ఇస్తున్నారా? అని సవాల్ విసిరారు.
ఇందిరమ్మ చీర కట్టుకొని సర్పంచికి ఓటు వేయండి
సర్పంచి ఎన్నికల్లో మద్యానికో, మాటలు చెప్పే వారికో ఓట్లు వేయవద్దని.. పనిచేసే వారిని ఎన్నుకోవాలని ప్రజలకు సీఎం రేవంత్ సూచించారు. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ చీర అంటే ఆడబిడ్డ సారె అని.. ఆ ఇందిరమ్మ చీర కట్టుకొని మంచి నాయకుడికి ఓటు వేయాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో నిర్మిస్తామన్నారు.
దేశానికే ఆదర్శంగా ఉండే తెలంగాణ మోడల్‌ను అందిస్తాం
ధాన్యం దిగుబడిలో, డ్రగ్స్, గంజాయిని అరికట్టడంలో, విద్య, వైద్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేలా తెలంగాణ మోడల్‌ను ప్రకటిస్తామన్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ. 1,800 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ గిరిజన ప్రాంతం కాబట్టి వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎంను కోరారు. సభలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


