కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషికి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషికి సీఎం రేవంత్ సూచన
ఎఫ్‌సీఐ తీసుకునే బాయిల్డ్ రైస్ కోటాను మరో 10 ఎల్‌ఎంటీలు పెంచాలి
పీడీఎస్ బియ్యం సబ్సిడీ రూ.1,468 కోట్లు విడుదల చేయాలి
2024–25 ఖరీఫ్ సీఎంఆర్ గడువు పొడిగించాలన్న ముఖ్యమంత్రి
‘సన్న బియ్యం’పై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రమంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని దేశమంతటా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీంతో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ సమస్య తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు.
ప్రజలు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం లక్ష్యం నెరవేరిందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిరి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. పథకంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచి్చన ప్రల్హాద్ జోషితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ, సంస్థలకు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రికి వివరించిన ముఖ్యమంత్రి..అవసరమైన సహకారం అందించాలని కోరారు.
బకాయిలు విడుదల చేయండి
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన లెవీ బియ్యానికి సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. పీఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.343.27 కోట్ల సబ్సిడీ కూడా విడుదల చేయాలన్నారు. 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐ ద్వారా తీసుకునే బాయిల్డ్ రైస్ కోటాను 10 లక్షల మెట్రిక్ టన్నుల మేర అదనంగా పెంచాలని కోరారు. 2024–25 ఖరీఫ్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువు పొడిగించాలని కోరారు.
ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ ర్యాకులు కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2025–26 ఖరీఫ్‌లో అత్యధికంగా 148 ఎల్‌ఎంటీల ధాన్యం దిగుబడి వచి్చందని, అయితే 50 లక్షల ఎల్‌ఎంటీల కొనుగోలుకే కేంద్రం పరిమితం చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 80 ఎల్‌ఎంటీలకు పెంచాలని కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని ప్రల్హాద్ జోషి హామీ ఇచ్చారు.
2030 వరకు పేదలకు ఉచిత బియ్యం
నల్లగొండ: ఆహార భద్రతలో భాగంగా పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం పథకాన్ని 2030 వరకు కొనసాగించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు ప్రల్హాద్ జోషి తెలిపారు. గురువారం నల్లగొండలో కొత్తగా నిర్మించిన ఆ శాఖ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘పూరా.. రెడ్డీ హై నా..’
నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేంద్రమంత్రికి వీడ్కోలు పలికేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హెలీపాడ్‌కు వచ్చారు. లక్ష్మారెడ్డిని పరిచయం చేయగా.. ‘పూరా రెడ్డీ హైనా’అంటూ జోషి చమత్కరించారు. దీంతో శంకర్‌నాయక్.. ‘మై నాయక్ హూ..’అంటూ ముందుకు రావడంతో అక్కడ నవ్వులు విరిసాయి.


