సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో ఆదివారం రాత్రి 10 గంటలకు అధికారులు గేటుకు తాళాలు వేసి లోపల కసరత్తులు జరుపుతున్నారనే వార్తలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. సెలవు రోజు రాత్రి వేళలో అధికారుల హడావుడి ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహులు, అనుచరులతో కలిసి అధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డుకు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు అనుకూలమైన ఓటర్లను తమ పరిధిలో ఉంచుకుని, ప్రతికూలంగా ఉన్నవారిని పక్క వార్డులకు బదిలీ చేయడానికి రహస్యంగా కసరత్తు చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చీకటి దందాకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
రేపటితో ఓటర్ల నమోదు (Voter Enrollment) చివరి తేదీ కావడంతో అభ్యంతరాలు స్వీకరించడానికే రాత్రి వేళలో తాళాలు వేసి పని చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరినే లోపలికి అనుమతించి మరికొందరిని బయటే నిలిపివేయడం ప్రజల్లో అనుమానాలను రేపింది. దాంతో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఓట్ల మార్పిడి దందా జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. రాత్రి వేళలో తాళాలు వేసి అధికారులు చేసే ఈ రహస్య కసరత్తులు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని ఓటర్ల హక్కులను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


