కష్టతరంగా మారుతున్న అమెరికా చదువు
ప్రవేశానికి ముందే సవాళ్లు.. అన్ని విధాలా కూపీ లాగుతున్న వర్సిటీలు
సోషల్ మీడియా ఖాతాలూ క్షుణ్ణంగా తనిఖీ
ఐ–20 పొందడం సవాలుగా మారుతున్న వైనం
విద్యార్థి సమర్పించిన వివరాల్లో తప్పులున్నా,స్పెల్లింగ్ మిస్టేకులున్నా కష్టమే
ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే కారణం
సాక్షి, హైదరాబాద్: అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. కీలకమైన ఐ–20 పత్రాల జారీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నాయి. విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పత్రాల జారీ ఆపేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల పత్రాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళ్తుంటారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు లక్ష వరకు ఉంటారు. కాగా ఆగస్టులో మొదలయ్యే విద్యా సంవత్సరానికి ఆరు నెలల ముందే అనుమతులు పొందాల్సి ఉంటుంది. యూఎస్ వీసా తీసుకోవడం ఒక ఎత్తైతే, తాజాగా వర్సిటీల్లో ఐ–20 పత్రం పొందడం మరో ఎత్తవుతోంది. వీసా వచ్చినా ఐ–20 రాకపోతే యూఎస్ వెళ్లేందుకు వీలుండదు.
ఐ–20 అంటే ఏమిటి?
ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్థులు ముందుగా అక్కడి యూనివర్సిటీలను ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సీటివ్వడానికి ఒప్పుకున్న యూనివర్సిటీ సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ (ఐ–20) పత్రం ఇవ్వాలి. ఇందులో విద్యార్థి ఎంపికైన కోర్సు, ఆ కోర్సు కాల వ్యవధి, ఫీజు వివరాలు, విద్యార్థి ఆర్థిక సామర్థ్యం వివరాలు ఉంటాయి. దీని ఆధారంగా యూఎస్‌లో యూనిక్ కోడ్ ఇస్తారు. వర్సిటీ ఇచ్చే వివరాల ఆధారంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్‌ఈవీఐఎస్) అనే సంస్థ పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఇది విద్యార్థికి చాలా కీలకం. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–1 వీసాకు దీన్ని ముఖ్యమైన డాక్యుమెంట్‌గా గుర్తిస్తారు.
సమస్య ఎక్కడ?
విద్యార్థులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వర్సిటీలపైనే చర్యలు తీసుకుంటామని ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రకటించింది. అవసరమైతే యూనివర్సిటీ గుర్తింపునే రద్దే చేస్తామని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రతీ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాస్ట్‌పోర్టు వివరాల్లో తప్పులున్నా, అకడమిక్ వివరాల్లో స్పెల్లింగ్ తప్పిదాలున్నా, మార్క్‌ట్ తేదీల్లో తేడాలున్నా ఐ–20 పత్రాలు ఆపేస్తున్నాయి. యూఎస్‌లో కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఫీజులు, జీవించడానికి అయ్యే ఖర్చుల అంచనాలను వర్సిటీలే లెక్కగడతాయి. ఆ మొత్తాన్ని బ్యాంకు బాలెన్స్‌గా చూపించాల్సి ఉంటుంది.
కన్సల్టెన్సీలు ఈ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో వేయడం, విద్యార్థి అమెరికా వెళ్ళగానే తీసుకోవడం చేస్తుంటాయి. ప్రస్తుతం వర్సిటీలు కొత్తగా ఆరు నెలల బ్యాంక్ బ్యాలెన్స్, అది ఏ రూపంలో జమ అయ్యిందో చూస్తున్నాయి. వాటిని స్పాన్సర్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసుకునే కోర్సులకు సంబంధించి భారత్‌లో విద్యార్థి చేసిన కోర్సు, సాధించిన మార్కులు, ఇంటర్న్‌షిఫ్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా పత్రాల జారీ నిలిపివేస్తున్నారు.
సోషల్ మీడియాపై దృష్టి
విద్యార్థి సామాజిక ఖాతాను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలు ఎన్ని ఉంటే అన్నింటి వివరాలు ఇవ్వాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. వీటిల్లో గత కొన్నేళ్ళుగా విద్యార్థి ఎలాంటి పోస్టింగ్‌లు పెట్టాడు? ఏయే సంస్థలతో లింక్ అయి ఉన్నాడు? అమెరికాలోని ఏయే వ్యక్తులతో అతనికి సంబంధాలున్నాయి? వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏమిటి? ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమిటి? కుటుంబ నేపథ్యం ఏమిటి? అనే వివరాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్టు కన్పించినా ఐ–20 పత్రం ఇవ్వడానికి వర్సిటీలు సాహసించడం లేదు. సదరు విద్యార్థితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరిలోనైనా యూఎస్ వ్యతిరేక భావజాలం ఉన్నట్టు కన్పించినా విచారణకు ఆదేశిస్తున్నారు.
యూనిక్ ఐడీ ఇవ్వడానికి ఇదే కొలమానం
ఏడాదిగా అమెరికా భద్రత వ్యవహారాల్లో యూనివర్సిటీల బాధ్యత పెంచారు. విదేశీ విద్యార్థులను రప్పించే క్రమంలో అన్ని వివరాలు పరిశీలిస్తున్నారు. అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు పాల్పడినా పరిణామాలు త్రీవంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఐ–20 పత్రాలు ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం.
– నవీన్ చావ్లా (యూఎస్ వర్సిటీలో భారతీయ అధ్యాపకుడు)
విదేశీ స్నేహితుల వివరాలు అడిగారు
అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆగస్టులో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఫేస్‌బుక్‌లో ఇతర దేశాల్లో ఉన్న స్నేహితులూ యాడ్ కావడంతో వాళ్ళ గురించిన వివరాలు అడిగారు. ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన వివరాలు కోరారు. వీటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే పత్రాలు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి.
– రోషన్ స్తపతి (హైదరాబాద్ విద్యార్థి)


