నిర్లక్ష్యపు నిప్పు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు నిప్పు

Feb 27 2026 10:51 AM | Updated on Feb 27 2026 10:51 AM

నిర్లక్ష్యపు నిప్పు

నిర్లక్ష్యపు నిప్పు

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

బంజారాహిల్స్‌

జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–36లోని మెట్రోస్టేషన్‌ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో రెండు నెలల క్రితం వరకు మంగళగౌరీ అనే వస్త్ర దుకాణం కొనసాగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా షోరూం ముందు భాగంలో గోపురం డెకరేషన్‌ను, ఎదురుగా ఫుట్‌పాత్‌పై ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. షాపు మూసివేసిన తర్వాత ఎవరూ రాకపోవడంతో గోపురం డెకరేషన్‌ను తొలగించాలని భవన యజమాని టీవీ సురేష్‌కుమార్‌ నిర్ణయించి సిరాజ్‌ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు.

కొబ్బరి నార అంటుకుని..

ఉదయం 11 గంటల వేళ గోపురం డెకరేషన్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా నిప్పురవ్వలు రావడంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ కోసం ఏర్పాటుచేసిన కొబ్బరినార అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్‌ చేస్తున్న వారితో పాటు మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు బిల్డింగ్‌ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా రంగంలోకి దిగి మూడు ఫైరింజన్లతో మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చాయి. రెండు గంటల పాటు ఈ రోడ్డంతా స్తంభించిపోయింది.

భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే..

ఈ బిల్డింగ్‌లో మంగళగౌరీ వస్త్ర దుకాణాన్ని రెండు నెలల క్రితమే మూసివేశారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిల్డింగ్‌పై యజమాని టీవీ సురేష్‌కుమార్‌ ఒక అంతస్తును అక్రమంగా నిర్మించడంతో పాటు సెట్‌బ్యాక్‌లో ఒకవైపు జనరేటర్‌ ఏర్పాటు చేసి, ఇంకోవైపు గదులు నిర్మించారు. దీంతో ఫైర్‌తో పాటు హైడ్రా సిబ్బంది పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని జూబ్లీహిల్స్‌ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకున్నా అక్రమ నిర్మాణాలతో పాటు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని అంటున్నారు.

అద్దాలు పగులగొట్టుకుని..

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు భవనం అద్దాలు పగులగొట్టుకుని బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో వీరంతా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పని చేస్తుండగా, ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పక్కనే ఉన్న అద్దాలను పగులగొట్టుకుని వీరు బయటకు పరుగులుతీశారు.

స్క్రాప్‌ గోదాంలో మరో ఘటన..

జీడిమెట్ల: నగరంలో గురువారం మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఏస్వీ కోఆపరేటివ్‌ సొసైటీలోని స్క్రాప్‌ గోదాంలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. మహ్మద్‌, ఇస్మాయిల్‌ అనే వ్యక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ కవర్లు, అట్టపెట్టెలు, మెడికల్‌ వ్యర్థాలు తీసుకువచ్చి గోదాంలో డంప్‌ చేసి విక్రయిస్తుంటారు. సాయంత్రం 6 గంటలకు గోదాంలో కూలీలు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కూలీలు బయటికి పరుగులు తీశారు. జీడిమెట్ల ఫైర్‌ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అనుమతులు లేని గోదాంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హంగులతో బెంగ

వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వ్యాపార సంస్థలు చేసే హంగూ ఆర్భాటాలు, ప్రత్యేక అలంకరణలు అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వస్త్ర దుకాణాలు, వివిధ రకాల షోరూమ్‌లు భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా అలంకరణలకు పాల్పడుతున్నాయి. ఈ తరహా అగ్ని ప్రమాదాలపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా తదితర విభాగాల అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి వస్త్ర దుకాణం వద్ద జరిగిన ప్రమాదానికి సెట్టింగే కారణమని అధికారులు తేల్చారు. మొదట సెట్టింగ్‌కు మంటలు అంటుకొని ఆ తర్వాత షోరూమ్‌లోకి వ్యాపించడంతో భవనం దగ్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.

గోపురం డెకరేషన్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా ఘటన

వాణిజ్య భవనంలో ఎగిసిపడిన మంటలు

అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు

ప్రాణం నష్టం జరగకపోవడంతో ఉపశమనం

Advertisement
 
Advertisement
Advertisement