అనుమానం రాకుండా మైనర్ల వినియోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ సహా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి ఉత్పత్తి చేసి, నగరానికి సరఫరా చేసే ముఠాలు తెలివి మీరుతున్నాయి. ఈ రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మైనర్లను క్యారియర్లుగా వినియోగిస్తున్నాయి. చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ముఠాతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేయగా వీరిలో ముగ్గురు బాలురు ఉన్నారని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ప్రకటించారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఒడిశాలోని మల్కాన్‌గిరికి చెందిన కిషోర్ తక్రి అక్కడ గంజాయి పండించే వారి నుంచి సరుకు సేకరించి నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తుంటాడు. రెండు మూడేళ్లుగా ఈ దందా చేస్తున్న ఇతడిని 2024, 2025ల్లో ఒడిశాలోని మోటు పోలీసులు పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లు తీసుకువస్తుండగా అనుమానించిన అధికారులు తనిఖీ చేసి అరెస్టు చేశారు. దీంతో పోలీసులు అనుమానించని పంథాలో సరుకు రవాణా చేయాలని ఇతగాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం మల్కాన్‌గిరితో పాటు కోరాపుట్‌కు చెందిన మైనర్లను ఎంచుకున్నాడు. వీరిని ఒక్కో ట్రిప్‌నకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండుమూడు రోజులు సాగే ఈ ప్రయాణంలో వారికి అయ్యే ఖర్చంతా కిషోరే భరిస్తాడు. తాను అప్పగించిన గంజాయి నింపిన బ్యాగ్స్ లేదా బాక్సుల్ని హైదరాబాద్ వరకు తీసుకువచ్చి అప్పగించడమే వీరి పని. బస్సు, రైళ్లల్లో వీరితో కలిసే, కొద్దిదూరంలో ఉంటూ ప్రయాణించే ఇతడు పోలీసులకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన ఇంద్ర మాది, సంజయ్ వద్ద కిలో గంజాయి రూ.4 వేలకు ఖరీదు చేస్తున్న కిషోర్ దాన్ని ధూల్‌పేట్‌కు చెందిన శంకర్ సింగ్‌కు రూ.ఏడు వేలు చొప్పున విక్రయిస్తున్నాడు. గతంలో కొన్నిసార్లు ఇలానే ఖరీదు చేసిన శంకర్ ఆ సరుకును స్థానికంగా ఉన్న పెడ్లర్స్‌కు మరింత రేటుకు విక్రయిస్తున్నాడు. తాజాగా ధూల్‌పేట్‌కు చెందిన వినయ్ సింగ్ తనకు 23 కేజీలు కావాలంటూ శంకర్‌కు చెప్పాడు. దీంతో ఫోన్ పే ద్వారా రూ.1.40 లక్షలు కిషోర్‌కు చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. కిషోర్ ఈ గంజాయిని అక్కడే ఉండే బలరాం నుంచి ఖరీదు చేసి 11 ప్యాకెట్లుగా పార్శిల్ చేశాడు. దీన్ని బంధువులైన మహిళలు పన్మతి తక్రి, లక్ష్మి తక్రిలతో పాటు ముగ్గురు మైనర్లకు అప్పగించాడు. వీరిని ఓ కుటుంబం మారిదిగా పేర్కొంటూ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సరుకు తీసుకోవడానికి శంకర్ ఎంజీబీఎస్ సమీపంలోకి వచ్చాడు. ఈ దందాపై చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మహేష్, ఎం.మధు, కె.స్వామి, కానిస్టేబుల్ హరీష్ కుమార్ వలపన్ని ఏడుగురినీ పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. వీరి విచారణలో వినయ్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో అతడి కోసం గాలిస్తున్నారు.
వెలుగులోకి గంజాయిస్మగ్లర్ల కొత్త ఎత్తులు
ప్యాకెట్లు మోసేందుకు బాలుర వినియోగం
రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లింపు
ఏడుగురిని అరెస్టు చేసిన చార్మినార్ టాస్క్‌ఫోర్స్


