తమ్ముడు నడవ లేడు. రోజూ వచ్చే నాన్న ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. తనకేమో కాళ్లకు చెప్పులు కూడా లేవు. బరువు లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడే. కానీ తమ్ముడిని భుజాన మోశాడు. చిన్నతనంలో పెద్దరికం చూపించాడు. ఈ చిత్రంలో భుజాన ఉన్న అబ్బాయి పేరు కింతలి రూపే. ఊరు అలుదు. మజిల్ డిజార్డర్ వల్ల బడికి నడిచి వెళ్లే పరిస్థితి లేదు. రోజూ తండ్రి వెంకటరమణ బైక్‌పై బడికి తీసుకెళ్లి తీసుకువస్తుంటారు.
శుక్రవారం ఆయన బడికి రావడం ఆలస్యమైంది. ఒంటి పూట కావడంతో మధ్యాహ్నం ఎండ చుర్రుమంటోంది. తండ్రి రాక ఆలస్యం అవుతుండడంతో రూపేష్ అన్న గోవర్ధన్ ఇలా తమ్ముడిని భుజాన మోసుకుంటూ బడికి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. కాళ్లకు చెప్పులు లేకపోయినా.. ఎండ ధాటికి పాదా లు కాలిపోతున్నా నవ్వుకుంటూ తమ్ముడిని తీసుకెళ్లాడు. అమ్మలా మోసి.. నాన్నలా కాపు కాచి అన్న అనిపించుకున్నాడు. తండ్రి వచ్చాక ముగ్గురూ బండిపై ఇంటికెళ్లారు. తమ్ముడిని గోవర్ధన్ ప్రేమగా మోసుకెళ్తున్న దృశ్యం ముచ్చట గొలిపింది. – సారవకోట, శ్రీకాకుళం జిల్లా


