ట్రంప్‌, మునీర్‌ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్‌ | US Report Says Trump And Asim Munir Iran ties red flag | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, మునీర్‌ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్‌

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:40 AM

US Report Says Trump And Asim Munir Iran ties red flag

గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్‌ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్‌ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్‌ నేతలపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్‌పై ట్రంప్‌ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్‌కు గురి చేస్తోంది. మునీర్‌తో స్నేహమంటే అమెరికాను రెడ్‌ జోన్‌లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్‌ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..

అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్‌కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్‌ అలర్ట్‌గా భావిస్తున్నారు.

ఇరాన్‌తో సంబంధాలు..
మునీర్ గతంలో ఇరాన్‌కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్‌జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మధ్యవర్తిత్వం  అవకాశమా? ప్రమాదమా?
మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

చారిత్రక అనుమానాలు..
అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్‌పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్‌కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు.

Advertisement
 
Advertisement
Advertisement