రుతుపవనాల దగా? | Sakshi Editorial On Monsoons and Weather | Sakshi
Sakshi News home page

రుతుపవనాల దగా?

Apr 17 2026 12:50 AM | Updated on Apr 17 2026 12:50 AM

Sakshi Editorial On Monsoons and Weather

ఒక్కోసారి కష్టాలు కూడబలుక్కుని వస్తాయంటారు. అసలే అమెరికా, ఇజ్రాయెల్‌ దురాక్రమణ యుద్ధాలతో ఏటికి ఎదురీదుతున్న ప్రపంచంపై ఈసారి ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడుతోంది. రాగల కాలంలో వాతావరణ పరిస్థితుల గురించి భారత వాతావరణ విభాగం(ఐఎండీ), ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన అంచనాలు భయపెడుతున్నాయి. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్ర జలాల్లో అత్యంత తీవ్రమైన ఎల్‌ నినో ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరగటంతోపాటు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించగా, మన దేశంలో రుతుపవనాలు బలహీనపడి సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ సైతం ఇదేవిధంగా చెబుతోంది. వైద్య పరిభాష మాదిరే వాతావరణానికి సంబంధించిన పరిభాష కూడా సామాన్యులకు కొరుకుడు పడదు. ‘సాధారణంకన్నా తక్కువ’ వర్షపాతం ఉంటుందంటే– తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయని. మన దేశంలో 60 శాతంమంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పూర్తిగా రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడతారు. శాస్త్రవేత్తల అంచనా నిజమైతే ఇప్పటికే అనేకచోట్ల వడగళ్లుపడి, వర్షాలు కురిసి నష్టపోయిన రైతులకు ఇది సహజంగానే గోరుచుట్టుపై రోకటి పోటువంటి దవుతుంది. 

ఒకప్పుడు ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం మూడురోజులముందే వాన ఎక్కడెక్కడ పడే అవకాశం ఉన్నదో, దాని తీవ్రత ఎలావుంటుందో అంచనా వేస్తున్నారు. తుపాన్లు, ఉప్పెనలు, సునామీలు వంటివి ముందస్తుగా పసిగట్టి వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ఠ స్థాయికి ఉంచగలుగుతున్నారు. అలాగని అన్నీ కచ్చితంగా చెప్పటం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రకృతిని అంచనా వేయటం జూదంలాంటిది. అది అర్థమైనట్టే కనబడుతుంది. తీరా కొన్ని సందర్భాల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అలాగని ఏమరుపాటుతో ఉంటే ముంచేస్తుంది. అందుకే సమస్యలొస్తాయన్న అంచనాలతో ముందస్తు చర్యలు ఎప్పుడూ తప్పనిసరవుతాయి.

అయితే ప్రస్తుత అంచనాలు ప్రాథమికమైనవి. వచ్చే నెలాఖరు నాటికి మరికొంత స్పష్టత వస్తుంది. ఎల్‌ నినో ఏర్పడటానికీ, రుతుపవనాలు బలహీనపడటానికీ మధ్య బలమైన సంబంధం ఉంది. గత 70 ఏళ్లలో 17 సార్లు ఎల్‌ నినో ఏర్పడితే అయిదుసార్లు సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన సంవత్సరాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. గ్రామీణ భారతంలో మెజారిటీ ప్రజానీకం వ్యవసా యంపై ఆధారపడతారు. అందువల్లే వర్షాలుపడక కరువుకాటకాలు ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో వానలు లేకపోవడం లేదా అకాల వర్షాలు పడటం కారణంగా పంటలు దెబ్బతిన్నాయిగానీ... దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా వర్షపాతం బాగానే ఉంది. సాగు దిగుబడి పెరిగింది. ఆహార ధరలు అదుపులో ఉన్నాయి. అందువల్లే రిజర్వ్‌బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించింది. కానీ ఇదంతా తారుమారైతే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీరేట్లు మళ్లీ పైపైకి పోతాయి. నిజానికి ఇరాన్‌ యుద్ధంవల్ల ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. 

మన దేశానికి సంబంధించి కేవలం ఎల్‌ నినో ఒక్కటే నిర్ణాయక శక్తి కాదు. హిందూమహాసముద్రంలో పశ్చిమ(ఆఫ్రికా వైపు), తూర్పు(ఇండొనేసియా వైపు) ప్రాంతాలమధ్య ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల అనుకూల, ప్రతికూల, తటస్థ ద్విధ్రువ (డైపోల్‌) స్థితులు ఏర్పడవచ్చు. అనుకూల స్థితి ఎల్‌ నినోవల్ల ముందుకు కదల్లేని రుతుపవనాలకు బలం చేకూర్చి భారత్‌ వైపు వచ్చేలా చేస్తుంది. మిగిలిన రెండూ అందుకు భిన్నమైన ఫలితాలనిస్తాయి. దానికితోడు యురేసియా ప్రాంతంలో ఈసారి మంచుకవచం తక్కువుందంటున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు మెరుగ్గానే ఉంటాయనుకోవచ్చు. ఏదేమైనా ఈసారి రుతుపవనాలపై ఏ ప్రభావాలు బలంగా పనిచేస్తాయో, వాటి ఫలితాలెలా ఉంటాయో పెద్ద సస్పెన్స్‌. అంతా సవ్యంగా ఉండాలని కోరుకోవటం మినహా ఎవరైనా చేయగలిగిందేమీ లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement