బతుకు తెరువు వెతుక్కుంటూ కొత్త ప్రాంతాలకు వెళ్లడం ఇవాళ్టి సంస్కృతి కాదు. మానవజాతి పుట్టినప్పటినుంచి ఉన్న వ్యవహారమే. ఇప్పటికీ మనం మన నైపుణ్యాలకు, ఆసక్తులకు తగిన వృత్తులు, వ్యాపారాలు, వ్యాపకాలు వెతుక్కుంటూ కొత్త ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వెళుతూ ఉంటాం. బతుకుతూ ఉంటాం. ఈ క్రమంలో అక్కడి స్థానిక మర్యాదలను పాటించినప్పుడే మనకు మనుగడ ఉంటుంది.
సాధారణంగా ‘లా ఆఫ్ ది ల్యాండ్’ ను పాటించాలి.. అని పెద్దలు అంటూ ఉంటారు. రోమ్ నగరంలో రోమన్ లాగానే జీవించాలి అని చెప్పే ఇంగ్లిషు నానుడికే మరో రూపం ఈ మాట. ఏ ప్రాంతానికి వెళ్లి జీవించాలనుకుంటే ఆ ప్రాంతపు జీవన శైలులకు, సంస్కృతికి, భాష సాంప్రదాయాలకు మనమే అలవాటు కావాలి. అప్పుడే మర్యాద దక్కుతుంది. కానీ.. దక్షిణాది రాష్ట్రాల మీద కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఈ సంస్కారాన్ని ధిక్కరించే, పూర్వపక్షం చేసే దుర్మార్గమైన పోకడ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్నే సినీనటుడు ప్రకాష్ రాజ్ ఒక ఆసక్తికరమైన కల్పిత కథతో ముడిపెట్టి సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇటీవల ప్రకాష్ రాజ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చిన్న కథ చెప్పారు. ఉత్తరాది నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత దక్షిణాదికి వచ్చారు. అడవుల వెంట నడచి వెళుతున్న క్రమంలో వారికి పండ్ల చెట్లతో నిండిన అడవి కనిపించింది. ఇది అడవి కాదు.. ఎవరిదో ప్రైవేటు తోట అనే క్లారిటీ రాముడికి ఉన్నది గానీ.. లక్ష్మణుడికి ఆకలి వేస్తోంది గనుక పండ్లు కోసుకుని తినమని చెప్పాడు. ముగ్గురూ కడుపునిండా పండ్లు తిన్నారు. ఈలోగా అక్కడకు శూర్పణఖ, రావణుడు వచ్చారు. ఎవరో పండ్లు తినేస్తున్నారని శూర్పణఖ అంటే.. పోన్లే పాపం ఆకలితో ఉన్నట్టున్నారు.. తిననివ్వు అన్నాడు రావణుడు. అంతా అయ్యాక.. మీరు పండ్లు తిన్నారు గనుక.. డబ్బు చెల్లించండి అని అడిగాడు. ఎంత అని రాముడు అడిగితే జీఎస్టీతో కలిపి రెండువేలు అన్నాడు. మాదగ్గర అంత లేదు అన్నాడు రాముడు.
Prakash Raj's hilarious take on Hindi Imposition.....
In 'Thoolika Politics' session, narrates Ram, Lakshman as North Indian migrants eating fruits on a South Indian farm, sparking a feud over a $2000 GST bill.
Don't force Hindi with that One Nation, One Religion 🔥 pic.twitter.com/aRSEr88bef— D (@Deb_livnletliv) April 16, 2026
సరే అయితే.. 20శాతం డిస్కౌంటు ఇస్తా అన్నాడు రావణుడు. ఆ డబ్బు కూడా లేదు అన్నాడు రాముడు. సరే అయితే మీ దగ్గర డబ్బులూ లేవంటున్నారు గనుక.. మీరు టూరిస్టులు కాదు. కడుపుకూటికోసమే ఇక్కడకు వచ్చారు.. ఎటూ పండ్లు తినేశారు గనుక.. ఆ విత్తనాలను ఇక్కడే విత్తి.. ఇక్కడే పని చేసుకుంటూ బతకండి అని చెప్పాడు రావణుడు. ఇది ప్రకాష్ రాజ్ చెప్పిన కథ. ఉత్తరాది నుంచి ఓ వ్యక్తి ఎక్కడో కేరళలో బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం చేయడానికి వస్తే.. ఇక్కడి ప్రజలు హిందీ ఎందుకు నేర్చుకోవాలి? అతడే కదా మళయాళం నేర్చుకోవాలి అనేది ప్రకాష్ రాజ్ వినిపిస్తున్న వాదన. బతుకు తెరువు కోసం వచ్చేవాళ్లు.. ఈ నేల మీద భాషా సాంప్రదాయాల్ని గౌరవించాలే తప్ప.. తమకు తెలిసినది ఇక్కడి వాళ్లు నేర్చుకోవాలని భీష్మించుకుంటే మూర్ఖత్వం అవుతుందని ఆయన అంటున్నారు.
కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా హిందీ రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇదే విధంగా ఉంటున్నాయనేది ఆయన లాజిక్. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అనే నినాదంతో దేశాన్నంతా ఒకటి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల పట్ల ప్రకాష్ రాజ్ తన ధిక్కార స్వరాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా బలంగానే వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేకత ప్రబలంగా ఉండదు. తమిళనాడులో హిందీ వ్యతిరేక పోరాటాలు ఏ స్థాయిలో సాగుతూ ఉంటాయో మనందరికీ తెలుసు. అదే విధంగా.. కేరళ కూడా హిందీ భాషను, ఉత్తరాది సంస్కృతీ సంప్రదాయాలను బలవంతంగా తమ మీద రుద్దడాన్ని నిరసిస్తుంటుంది. ఇదే వైఖరిని ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో వెటకారంగా, వ్యంగ్యంగా పిట్టకథతో చెప్పిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
..యం.రాజేశ్వరి.


