సమతా... మానవతామూర్తి
మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పుటి కట్టుబాట్లను దాటి మానవు లందరికీ భగవంతుని చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. శ్రీ మహావిష్ణువు శేషపానుపే రామానుజులుగా ఈ భూమిపై అవతరించి వెయ్యేళ్లు దాటింది. ఈ నెల 22న రామానుజ జయంతి. ఈ సందర్భంగా రామానుజులవారి జీవిత విశేషాలు...
రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు..
గురువుకే గురువు
శ్రీరామానుజాచార్యులవారు 16 సంవత్సరాల వరకూ శ్రీపెరంబుదూరులో, ఆ తర్వాత 8 ఏళ్లపాటు తిరుప్పుట్ కుళిలోనూ, పదేళ్లపాటు కంచిలో వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రామానుజులవారి ప్రజ్ఞ గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపుగా మారింది. వారిని చంపడానికి గురుశిష్యులంతా పన్నాగం పన్నారు. సాక్షాత్తూ కంచి వరదరాజస్వామివారే రామానుజులును ఆ ప్రాణాపాయం నుంచి తప్పించారు. చివరికి కంచికి చేరారు. ఆనాటి నుంచి నిత్యం వరదరాజ పెరుమాళ్ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు రామానుజులు.

విశిష్టాద్వైతం అంటే?
దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం. ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటమే విశిష్టాద్వైతం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటిగా ఉండవచ్చని తెలిపారు.
పాండిత్యం... ప్రాచుర్యం
రామానుజులవారు శ్రీ భాష్యమనే పేరుతో ప్రస్థాన త్రయానికి భాష్యం రచించారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్టసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ద్రవిడ వేదంపట్ల అందరూ గౌరవ ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు.
మూర్తీభవించిన సమత
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సులో గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు. దేశమంతటా సంచరిస్తూ... తన వాదం ద్వారా ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. 125 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సమతామూర్తిగా పేరు పొంది తన అవతార పరమార్థాన్ని నిరూపించుకున్నారు.
– డి.వి.ఆర్.


