కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కేవలం రాజకీయ విమర్శలు, సవాళ్లతోనే కాకుండా, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు ఇప్పుడు బెంగాల్ వీధుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు వింత విన్యాసాలతో ప్రజల ముందుకు వస్తున్నారు.
బన్స్‌బేరియాలో ‘స్వీట్’ పాలిటిక్స్
సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బన్స్‌బేరియాలో ప్రచారంలో ఉన్న ఆయన అకస్మాత్తుగా ఓ స్థానిక స్వీట్ షాపులోకి వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేయడం, రసగుల్లాలను తయారు చేయడం మొదలుపెట్టారు. తనకు పన్నీరుతో స్వీట్లు చేయడం బాగా తెలుసని, ఫలితాలు వెలువడే మే 4వ తేదీన తాను గెలిచినా, ఓడినా తన ప్రత్యర్థులకు కూడా ఈ రసగుల్లాలు తినిపిస్తానని ఆయన ప్రకటించడం విశేషం.
చేపతో చెక్ పెట్టిన బీజేపీ అభ్యర్థి
మరోవైపు బిధాన్‌నగర్ బీజేపీ అభ్యర్థి శారద్వత్ ముఖోపాధ్యాయ్ ప్రచారం చర్చనీయాంశమైంది. బెంగాలీల ఆహారపు అలవాట్లపై బీజేపీ ఆంక్షలు విధిస్తుందన్న మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్‌గా, ఆయన ఏకంగా ఒక పెద్ద చేపను చేతితో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బెంగాలీలు తమకు ఇష్టమైన చేపల కూరను ఆస్వాదించవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.
గృహిణులతో కలిసి రొట్టెలు.. ఉట్టి కొట్టే వేడుకలు
అధికార టీఎంసీ అభ్యర్థులు కూడా ప్రజలతో మమేకం కావడంలో వెనకడుగు వేయడం లేదు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి పార్థా హజారీ ఒక ఇంటికి వెళ్లి కట్టెల పొయ్యిపై గృహిణి చేస్తున్న రొట్టెలను స్వయంగా కాల్చారు. అలాగే, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేశ్ చంద్ర బౌరీ ఈద్ సందర్భంగా జరిగిన ‘హాండీ ఫోడ్’ (ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆయన కుండను పగలగొట్టిన తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.
బార్బర్‌గా ఎమ్మెల్యే.. యాగంలో కమ్యూనిస్ట్ నేత
ప్రచార పర్వం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సామాన్యుల్లో కలిసిపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా ఏకంగా ఓ గ్రామస్థుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరాలో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో అక్కడున్నవారికి ఆకట్టుకున్నారు. మరోవైపు, సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిసిన తర్వాత ఒక సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి తన సామాన్య జీవితాన్ని చాటుకున్నారు. వంట చేయడం, గడ్డం గీయడం, మసాలా దినుసులు నూరడం, రైతుల పక్కన పొలంలో పనిచేయడం వంటి రోజువారీ పనులతో అభ్యర్థులు సరికొత్త ప్రచార పర్వాన్ని సృష్టించారు. ఓటర్ల మదిలో చెరగని ముద్ర వేసేందుకు సాగుతున్న ఈ 'వినూత్న యుద్ధం'లో చివరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: ‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్


