సముద్రంలో ఘోర ప్రమాదం : 250 మంది గల్లంతు | Boat Capsizes In Andaman Sea Over 250 People Including Children Missing | Sakshi
Sakshi News home page

సముద్రంలో ఘోర ప్రమాదం : 250 మంది గల్లంతు

Apr 15 2026 12:56 PM | Updated on Apr 15 2026 1:12 PM

Boat Capsizes In Andaman Sea Over 250 People Including Children Missing

అండమాన్ సముద్రంలో భారీ నౌక ప్రమాదం ఆందోళన రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో ప్రయాణిస్తున్న  ఒక ట్రాలర్ (చేపల వేట పడవ) బోల్తా పడింది.   దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ (Teknaf) ప్రాంతం నుండి  బయలుదేరిన ఈ నౌకలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 280 మంది ప్రయాణిస్తున్నారు . ఇది ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరింది. దీంతో 250 మంది ఆచూకీపై ఆందోళన నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అధికలోడు, బలమైన గాలులు, తుఫాను కారణంగా నౌక మునిగిపోయినట్టు తెటలుస్తోంది. ఈ విషాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (యూఎన్‌హెచ్‌సీఆర్) స్పందించింది. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరి మలేషియాకు వెళ్తున్న ట్రాలర్, బలమైన గాలులు, సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి, అధిక రద్దీ మునిగిపోయి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. రోహింగ్యాలు దీర్ఘకాలంగా నిరాశ్రయులుగా ఉండటం, దీనికి శాశ్వత పరిష్కారం లేకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలకు నిదర్శనమని యూఎన్‌హెచ్‌సీఆర్ ఆవేదన వ్యక్తం చేసింది.

మయన్మార్‌లో ప్రజల స్థానభ్రంశానికి గల మూలకారణాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, అలాగే రోహింగ్యా శరణార్థులు స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు వీలు కల్పించే పరిస్థితులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేసిందని పేర్కొంది.

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.గాలింపు, సహాయక బృందాలు ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో  ఇంతవరకు ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అనే విషయంపై స్పష్టత   లేదు. అందరూ మరణించి ఉంటారని భయపడుతున్నారు. అధికారులు ఇంకా మృతుల కచ్చితమైన సంఖ్యను ధృవీకరించలేదు. గంటలు గడుస్తున్నా కచ్చిమైన సమాచారం రాకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. కాగా బంగాళాఖాతం, అండమాన్ సముద్రం గుండా జరిగే ఇటువంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాల గురించి మానవతా సంస్థలు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాయి.అయినా భద్రత, మెరుగైన జీవన పరిస్థితులకోసం  వారుప్రాణాలకి తెగించి ప్రాణాలను  పోగొట్టుకున్న వైనం విచారకరం.
 

Advertisement
 
Advertisement
Advertisement