బిహార్‌ బీజేపీ తొలి సీఎం చదువు, నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా? | Bihar New CM Samrat Choudhary education net worth details check | Sakshi
Sakshi News home page

బిహార్‌ బీజేపీ తొలి సీఎం చదువు, నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

Apr 15 2026 6:11 PM | Updated on Apr 15 2026 6:51 PM

Bihar New CM Samrat Choudhary education net worth details check

సాక్షి,పట్నా: బిహార్‌ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత,సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి బిహార్‌లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి  నెలకొంది.

ఆస్తుల వివరాలు
సమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి  మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు.  దీని ప్రకారం  తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది. అఫిడవిట్‌లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.

 ఈ దంపతుల పేరిట బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.27 లక్షలు ఉండగా, ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల విలువైన బంగారం ఉంది. అంతేకాకుండా, వీరి వద్ద రూ.75,000 విలువైన వెండితో పాటు, షేర్లు, బాండ్లు , మ్యూచువల్ ఫండ్లలో రూ.32 లక్షల విలువైన పెట్టుబడులు కూడా ఉన్నాయి.

 

విద్యార్హతలు, వివాదాలు
సమ్రాట్ చౌదరి విద్యా అర్హతలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్‌లోని ముంగేర్ జిల్లా, లఖన్‌పూర్ గ్రామంలో 1968 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి శకునీ చౌదరి కూడా బిహార్‌లో సీనియర్ నాయకుడు. రికార్డుల ప్రకారం ఆయన తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ప్రీ-ఫౌండేషన్ కోర్సు (PFC) పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు, ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు (కొన్నిసార్లు) సాహిత్యంలో డాక్టరేట్ (డి.లిట్.) ఉందని పేర్కొంటుండగా, ప్రశాంత్ కిషోర్ వంటి ప్రతిపక్ష నాయకులు ఆయన పదో తరగతి పరీక్షలోకూడా ఉత్తీర్ణుడు కాలేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement