‘నేను చేసిన పాపం ఏంటి?’.. వడోదర విద్యార్థిని కన్నీరు | Student Tears Up Over Dhak Dhak Dance Backlash | Sakshi
Sakshi News home page

‘నేను చేసిన పాపం ఏంటి?’.. వడోదర విద్యార్థిని కన్నీరు

Apr 15 2026 1:26 PM | Updated on Apr 15 2026 1:48 PM

Student Tears Up Over Dhak Dhak Dance Backlash

వడోదర: కళాశాల వేదికపై ఒక విద్యార్థిని చేసిన  డ్యాన్స్  వివాదానికి దారితీసింది. బాలీవుడ్‌ పాట‘ధక్ ధక్ కర్నే లగా’ పాటకు చీరకట్టులో ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో  ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే యూనివర్సిటీలోని సీసీ మెహతా ఆడిటోరియంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ‘సంస్కార్ సంగమం’ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో ఓ విద్యార్థిని బాలీవుడ్ పాటకు చీరకట్టులో డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రోల్ కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.

అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను విడుదల చేసిన ఆ విద్యార్థిని తాను కేవలం వేదికపై డ్యాన్స్ మాత్రమే చేశానని, అందులో ఎలాంటి అసభ్యత లేదని తెలిపింది. అయితే పాట ఎంపిక తన పొరపాటే కావొచ్చని అంగీకరిస్తూ, అందరికీ క్షమాపణలు తెలియజేసింది. ఈ  వివాదం తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయింది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతోందని  ఆరోపించింది.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) సభ్యులే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను వైరల్ చేశారని, తన వాదన వినిపించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేయించారని ఆమె విమర్శించింది. వడోదర సంస్కృతికి తాను ఎలాంటి భంగం కలిగించలేదని, అసలైన సమస్యలను గాలికి వదిలేసి, తనలాంటి ఓ సాధారణ విద్యార్థినిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది.

ఈ క్యాంపస్ డ్యాన్స్ వివాదం కాస్తా ఏబీవీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చగా మారింది. విద్యార్థిని అనుమతి లేకుండా ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను సర్క్యులేట్ చేసినందుకు కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐలు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏబీవీపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాన్ష్ బ్రహ్మభట్ డిమాండ్ చేశారు. దీనిపై గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి నిశాంత్ రావల్ స్పందిస్తూ.. ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ డ్యాన్స్ జరిగినప్పుడు, పాట సరికాదని భావిస్తే వారు అప్పుడే ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: విజయ్‌ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి

Advertisement
 
Advertisement
Advertisement