విజయ్‌ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి | TVK Candidate Faint Over Waiting for Vijay in Tiruppur | Sakshi
Sakshi News home page

విజయ్‌ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి

Apr 15 2026 12:48 PM | Updated on Apr 15 2026 1:02 PM

TVK Candidate Faint Over Waiting for Vijay in Tiruppur

తిరుప్పూర్‌: టీవీకే అధినేత దళపతి విజయ్‌ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎండల తీవ్రత, కిక్కిరిసిన జనసందోహం మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడులోని తిరుప్పూర్‌కు వచ్చిన తమ అభిమాన నాయకుడిని చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులు, పార్టీ శ్రేణులు భానుడి భగభగలకు విలవిలలాడారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏడుగురు మహిళలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు.

ఎండకు అల్లాడిన జనం
తమిళనాడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ విజయ్ చెన్నై నుంచి కోయంబత్తూర్ మీదుగా తిరుప్పూర్ బయలుదేరారు. విజయ్‌ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడం, మరోవైపు జనసందోహం అదుపు తప్పడంతో అక్కడివారికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. దాహంతో అలమటిస్తున్న జనాలకు నిర్వాహకులు నీరు అందించినప్పటికీ, వడగాల్పుల తీవ్రతకు  ఏడుగురు మహిళలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

స్పృహ కోల్పోయిన సులూరు అభ్యర్థి సుకుమార్ 
పార్టీ ముఖ్య నేతలకు కూడా ఈ ఎండల సెగ తప్పలేదు. కోయంబత్తూరులోని సులూరు నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సుకుమార్, కనియూర్ టోల్ ప్లాజా వద్ద విజయ్‌కు స్వాగతం పలికేందుకు తన మద్దతుదారులతో కలిసి వేచి ఉన్నారు. విపరీతమైన  ఎండ కారణంగా ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశారు.

తిరుప్పూర్‌లో విజయ్ సుడిగాలి పర్యటన
ఈ పరిస్థితుల నడుమ, కొచ్చిన్-సేలం జాతీయ రహదారి మీదుగా విజయ్ తన ప్రచార రథంపై తిరుప్పూర్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో (తిరుప్పూర్ నార్త్, తిరుప్పూర్ సౌత్, అవినాషి, పల్లడం, కంగేయం, ధారాపురం, ఉడుమలై, మడతుకులం) పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒకే రోజు ఇంత మంది వడదెబ్బకు గురవడం పలు ఆందోళనలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement