కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు! | Covid 19 Disruptions Delayed 55000 Cancer Diagnoses Study Reveals | Sakshi
Sakshi News home page

కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!

Jun 7 2026 7:46 AM | Updated on Jun 7 2026 11:04 AM

Covid 19 Disruptions Delayed 55000 Cancer Diagnoses Study Reveals

ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోవడం, లాక్‌డౌన్‌లు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు మాత్రమే మనకు గుర్తున్నాయి. కానీ, ఈ విపత్తు వెనుక ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద సంక్షోభం దాగి ఉందనే దిగ్భ్రాంతికర నిజాన్ని పరిశోధకులు ఇప్పుడు బయటపెట్టారు. కరోనా విజృంభణ సమయంలో రొటీన్ హెల్త్‌కేర్ సేవలు నిలిచిపోవడంతో, వేలాది మంది క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణ (డయాగ్నోసిస్) ఆలస్యమైంది. ఇది భవిష్యత్తులో వారి ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘ది లాన్సెట్ ఆంకాలజీ’ సంచలన అధ్యయనం
ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ ఆంకాలజీ’ ప్రచురించిన ఒక సంచలన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోని ఏడు అభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 55,000 క్యాన్సర్ నిర్ధారణ కేసులు రికార్డు కాలేదు. ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ దేశాలకు చెందిన దాదాపు 26 లక్షల మంది రోగుల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో, కరోనాకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ నిర్ధారణలు ఏకంగా 16 శాతం తగ్గాయని వారు కనుగొన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే గుర్తించాల్సిన వేలాది కేసులు వ్యవస్థలోకి రాలేదంటే, ఆ క్యాన్సర్లు మాయమయ్యాయని కాదు, కేవలం నిర్ధారణ కాకుండా రోగుల శరీరాల్లోనే ఉండిపోయాయని అర్థం.

కొంపముంచిన లాక్‌డౌన్‌
ఈ అంతరాయం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల కంటే కొన్ని నిర్దిష్ట క్యాన్సర్ల గుర్తింపు తీవ్రంగా ప్రభావితమైందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ నిర్ధారణలు అత్యధికంగా 24 శాతం తగ్గాయి. అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులు 18 శాతం, చర్మ క్యాన్సర్‌కు సంబంధించిన మెలనోమా కేసులు కూడా 18 శాతం మేర పడిపోయాయి. అయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ నిర్ధారణలపై ఈ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. సాధారణ హెల్త్ స్క్రీనింగ్‌లు లేదా సాధారణ ఓపీ సంప్రదింపులపై ఆధారపడే క్యాన్సర్లే లాక్‌డౌన్ల వల్ల ఎక్కువగా వెలుగులోకి  రాలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నిర్ధారణలు తగ్గడానికి గల ప్రధాన కారణాలు
కరోనా సమయంలో క్యాన్సర్ పరీక్షలు ఇంతలా క్షీణించడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అప్పట్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించడానికి అనేక దేశాలు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లను తాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముఖాముఖి అపాయింట్‌మెంట్లు దొరకడం గగనమైంది. మరోవైపు,  ఆస్పత్రులకు వెళ్తే ఎక్కడ కోవిడ్ సోకుతుందోననే భయంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను వాయిదా వేసుకున్నారు. సాధారణంగా క్యాన్సర్ తొలిదశలో కనిపించే చిన్నపాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి తీవ్రత పెరిగే వరకు అది బయటపడకుండా ఉండిపోయింది.

కొన్ని దేశాల ముందస్తు వ్యూహం 
ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని దేశాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. బ్రిటన్, ఐర్లాండ్ దేశాలతో పోలిస్తే నార్వే, న్యూజిలాండ్ దేశాలలో క్యాన్సర్ నిర్ధారణల తగ్గుదల చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఆ దేశాలు చాలా వేగంగా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలను నిరంతరాయంగా కొనసాగించగల బలమైన ఆరోగ్య వ్యవస్థలు ఉండటమే దీనికి కారణమని తేలింది. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో , ఆరోగ్య సేవలు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి ఈ దేశాల వ్యూహాలు ఎంతో సహాయపడతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రతినిధి ఇసాబెల్లె సోర్జోమతారమ్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో పొంచి ఉన్న దీర్ఘకాలిక ముప్పు
వైద్య సేవల్లో జరిగిన ఈ ఆలస్యం వల్ల రోగుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2020లో ఆలస్యంగా గుర్తించిన క్యాన్సర్లు వెంటనే తీవ్రమైన దశకు చేరుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ప్రస్తుత అధ్యయనంలో లభించనప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అనేది శరీరంలో ఏళ్ల తరబడి పెరుగుతుంది. కాబట్టి ఈ ఆలస్యపు పరిణామాలు భవిష్యత్తు డేటాలో మాత్రమే స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికే ‘జామా ఆంకాలజీ’ ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం, అమెరికాలో 2020-21లో జరిగిన క్యాన్సర్ కేర్ అంతరాయాల వల్ల ఏడాదిలోనే దాదాపు 17,390 మంది అదనంగా మరణించారని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వైద్య రంగానికి ఈ పరిశోధన నేర్పిన పాఠాలు
ఏదైనా ఒక మహమ్మారి వచ్చినప్పుడు కేవలం ఆ ఒక్క వ్యాధిపైనే కాకుండా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సపై కూడా దృష్టి పెట్టాలనే పఠాన్ని ఈ అధ్యయనం నేర్పుతోంది. భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలు, సాధారణ వైద్య సేవలను ప్రాధాన్యత క్రమంలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకత అనేది కేవలం అత్యవసర ముప్పును ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అందాల్సిన అవసరమైన నివారణ, రోగనిర్ధారణ సేవలను నిరంతరాయంగా అందించడంలోనే ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement