పూణె ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో గుర్తింపు
నెల్లూరు జిల్లాలో మూడేళ్ల బాలుడికి కోవిడ్
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసులు ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్–5 వేరియంట్‌కు చెందినవని తేలింది. నమోదవుతున్న కేసుల వేరియంట్ గుర్తించడం కోసం వైఎస్సార్ కడప జిల్లాలోని కోవిడ్ బాధితుల నాలుగు నమూనాలను మహారాష్ట్రలోని పూణె వైరాలజీ ల్యాబ్‌కు వైద్యశాఖ పంపింది. ఈ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్–5 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించినట్టు శనివారం వైద్య శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్ కేసులు సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదైనట్టు వెల్లడవుతోంది. ఒమిక్రాన్ ఇతర వేరియంట్‌లతో పోలిస్తే ఆర్‌ఎఫ్–5 ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవని వైద్యశాఖ వెల్లడించింది.
ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. అయితే ఈ వైరస్ సోకిన బాధితులు వైఎస్సార్ కడప జిల్లాలో మృత్యువాతపడటంతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఆర్‌ఎఫ్–5 వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, మూసుకుపోవడం, అలసట, ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్య శాఖ పేర్కొంది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు.
మూడేళ్ల బాలుడికి కరోనా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసు వెలుగు చూసింది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంగ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్‌కు గురయ్యాడు. వైద్యం కోసం ఆ బాలుడిని తల్లిదండ్రులు ఈ నెల 13న పాండిచ్చేరిలోని జిప్‌మర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కేన్సర్‌కు చికిత్స చేస్తూనే ఆ చిన్నారిలో కోవిడ్ లక్షణాలు గుర్తించి పరీక్షలు చేశారు.
కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆ బాబుకు కేన్సర్‌తోపాటు కోవిడ్ చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని అక్కడి వైద్యాధికారులు నెల్లూరు జిల్లా వైద్యశాఖ అధికారులకు అందించారు. నిడిగుంటపాళెంలో ఉన్న ఆ చిన్నారి నాయనమ్మ, అన్నయ్యకు ఇక్కడి వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, లేదని తేలింది. ఆ బిడ్డతో ఉన్న తల్లిదండ్రులకు పాండిచ్చేరిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగటివ్ వచ్చింది.


