ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా! | Document writers to go on indefinite strike from tomorrow criticizing govt approach | Sakshi
Sakshi News home page

ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా!

Jul 19 2026 2:45 AM | Updated on Jul 19 2026 2:45 AM

Document writers to go on indefinite strike from tomorrow criticizing govt approach

రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేట్‌ వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం

రైతుల భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించే దోపిడీకి పరాకాష్ట

రికార్డులు పూర్తిగా మార్చేసి భూములు, ఆస్తులు కొట్టేసేందుకు బాబు మార్కు ఎత్తుగడ 

విచ్చలవిడి అవినీతికి ప్రభుత్వం బరితెగించి రాచబాట  

నాడు ల్యాండ్‌ టైట్లింగ్‌పై దుష్ప్రచారం.. ఇప్పుడు ఏకంగా  రిజిస్ట్రేషన్ల వ్యవస్థే ప్రైవేటు పరం 

తొలి దశలో 26 జిల్లా కేంద్రాలు.. రెండో దశలో 294 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 

ఇప్పటికే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు, విద్య.. వైద్య, ఇతర రంగాల్లో పలు కీలక విభాగాలు ప్రైవేట్‌ పరం 

తాజాగా భూములు, ఆస్తులకు సంబంధించిన  రిజిస్ట్రేషన్ల వ్యవస్థ సైతం ప్రైవేటుకే 

పీపీపీ పేరుతో టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టనున్న చంద్రబాబు సర్కారు 

ఆంగ్లేయుల కాలం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగిన  రిజిస్ట్రేషన్ల వ్యవస్థ 

ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే ప్రజల ఆస్తులకు భద్రత.. ప్రభుత్వానికి బాధ్యత 

ప్రైవేట్‌కు ఇచ్చేస్తే భూముల డేటా, ఆస్తుల వివరాలన్నీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం ఖాయం 

స్టాంప్‌ డ్యూటీ వసూళ్లు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఈసీలు వంటివన్నీ వారి చేతుల్లోనే   

అప్పుడు భూ కబ్జాలు, దొంగ, డబుల్‌  రిజిస్ట్రేషన్లకు గేట్లు బార్లా తెరిచినట్టే 

ఏదైనా స్కామ్‌ బయటకు వస్తే ప్రైవేట్‌ ఉద్యోగులపై ఏం చర్యలు తీసుకుంటారు? 

తన తప్పుకాదంటూ ప్రభుత్వం తప్పించుకుంటుంది.. నష్టపోయేది రైతులు, అమాయకులు 

ప్రైవేట్‌పరం చేస్తే  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏం కావాలి? 

ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రేపటి నుంచి లక్ష మంది డాక్యుమెంట్‌ రైటర్లు నిరవధిక సమ్మె 

గత ఎన్నికలప్పుడు చంద్రబాబు అండ్‌ కో ఏం చెప్పి ప్రజల్లో అలజడి రేకెత్తించిందో.. తప్పుడు రాతలతో ప్రజల మెదళ్లలో ఎలా విషం నింపిందో.. దుష్ప్రచారంతో ఎలా తిమ్మినిబమ్మిని చేసిందో.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్షరాలా వాటిని నిజం చేస్తూ జనానికి చేటుచేస్తోంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిపోయి ప్రజలఆస్తుల వివరాలన్నింటినీ ఏకంగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోంది. ఇంత లోపభూయిష్ట విధానం అమలుకు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారంటే తద్వారా వారికి కలిగే లబ్ధి ఊహించనలవిగాదని స్పష్టమవుతోంది. రైతులు, అమాయకుల భూములను, ఆస్తులను తప్పుడు పత్రాలతో కాజేసే కుతంత్రాలకు ఇది రాచబాట అని తేటతెల్లమవుతోంది.

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి రాచబాట వేస్తోంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు, విద్య.. వైద్య, ఇతర రంగాల్లో పలు కీలక విభాగాలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. ఇది చాలదన్నట్లు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూకు సంబంధించిన  రిజిస్ట్రేషన్ల వ్యవస్థను సైతం ప్రైవేట్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం చేయడం విస్తుగొలుపుతోంది. శతాబ్ధాల తరబడి.. ఆంగ్లేయుల కాలం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగిన  రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేట్‌ వారికి ఇవ్వడం ద్వారా విచ్చలవిడి అవినీతికి ద్వారాలు తెరుస్తోంది.  

రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రభుత్వ పరిధిలో ఉంటేనే ప్రజల ఆస్తులకు కొంత మేరకైనా భద్రత ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అదే ప్రైవేట్‌ చేతుల్లోకి వెళితే రైతుల భూములను, అమాయకుల ఆస్తులను తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వంలో ఉండే వారే.. అధికార పార్టీ నేతలే కాజేసే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ పెద్దదై బట్టబయలైతే ప్రైవేట్‌ సిబ్బందిపై ఏం చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వం అందుకు బాధ్యత వహిస్తుందా? అది ఏమాత్రం జరగదు. ఎవరో ఒక ప్రైవేట్‌ ఉద్యోగిపై వేటు వేయడం మినహా చేసేదేమీ ఉండదు. ప్రభుత్వం తప్పించుకుంటుంది. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ వ్యవస్థ కొనసాగితే ప్రభుత్వానిదే బాధ్యత. తప్పు చేసిన వారిని శిక్షించడానికి, అవినీతి జరిగితే ఆస్తుల రికవరీకి అవకాశం ఉంటుంది.

ఇవన్నీ తెలిసీ కూడా చంద్రబాబు ప్రభుత్వం  రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేట్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తుందంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదని ఆ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించే కుట్రలు, కుతంత్రాలకు ఇక హద్దులుండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఇలా ప్రైవేట్‌కు ఇచ్చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులంతా ఏం కావాలి? ఇలాంటి విషయాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తన కమీషన్ల కోసం బరితెగించి ముందుకే వెళ్తోంది. విచ్చలవిడి అవినీతికి  రిజిస్ట్రేషన్ల వ్యవస్థను దివ్యౌషధంగా మలుచుకుంటుండటం సర్వతా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత బరితెగించి ఒక్క ఏపీలో మినహా దేశంలో ఏ రాష్ట్రం చేయడం లేదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   

తొలుత జిల్లా కేంద్రాలు.. ఆపై అంతటా
ప్రభుత్వ భూములను ఇష్టానుసారం కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టేందుకు బరి తెగించింది.  రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ముసుగులో రాష్ట్ర ప్రజల ఆస్తుల వ్యవస్థను మొత్తంగా ప్రైవేటు సంస్థల గుప్పిట్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా రూ.12 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న  రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రజల ఆస్తులకు శాశ్వత రక్షణ కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై నానా దుష్ప్రచారం చేసి.. రాజకీయంగా లబ్దిపొంది, ఇప్పుడు తీరా ఇదే చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెడుతుండటం విశేషం.  

తొలి దశలో 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ కేంద్రాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఇక రెండో దశలో రాష్ట్రంలోని 294 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కూడా ఇదే తరహాలో ప్రైవేటు వారికి అప్పగించాలనేది చంద్రబాబు యోచన. అంటే  రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటు పరం చేయడమే.  వీటిని రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) అని పిలిచినా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగానే నోటిఫై చేయనున్నారు.   

ఇక అంతా ప్రైవేటు చేతుల్లోకి 
ప్రస్తుతం డాక్యుమెంట్లు తయారు చేయడం, డేటా ఎంట్రీ, మార్కెట్‌ వాల్యూ చూడడం, నిషేధిత జాబితాలోని ఆస్తుల వెరిఫికేషన్, లింకు డాక్యుమెంట్లు చెక్‌ చేయడం, స్టాంప్‌ డ్యూటీ కట్టించుకోవడం, ఈసీ వెరిఫికేషన్‌ వంటి పనులన్నీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించనున్నారు. ప్రభుత్వ సిబ్బందికి రిజిస్ట్రేషన్ల చట్టంతోపాటు రూల్సు, విధివిధానాలన్నీ తెలుసు. వారిపై వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటుంది. అయినా సరే తప్పుడు రిజిస్ట్రేషన్లు, దొంగ  రిజిస్ట్రేషన్లు నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి. 

ఇక ప్రైవేటు వారికి పెత్తనం ఇస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉంటుందా? కేవలం లాభం కోసమే పని చేసే వారు ఈ బాధ్యతలన్నీ ఎలా నిర్వర్తించగలరనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒక ఆస్తిపై అప్పులు ఉన్నాయా.. వివాదాలు ఉన్నాయా.. ఇప్పటికే ఎవరికైనా అమ్మారా.. అన్నది తేల్చేది సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాల్లోనే. అది ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళితే వారు సరిగా చేస్తారా? డబ్బులిస్తే వెరిఫికేషన్‌ను మార్చేసే పరిస్థితి ఉంటుంది కదా? అదే జరిగితే అమాయకులు వివాదాస్పద ఆస్తులను కొని జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.  

స్టాంప్‌ డ్యూటీ కట్టించుకునేది ప్రైవేటు వ్యక్తులే  
కొత్త విధానం ద్వారా స్టాంప్‌ డ్యూటీ కూడా ప్రైవేటు సంస్థలే కట్టించుకుంటాయి. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని వారి చేతుల్లో పెట్టినట్లే.  రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత భారీ ఆదాయం వచ్చే వ్యవస్థను ప్రైవేటుకు అప్పగిస్తే ఆ ఆదాయాన్ని పక్కదారి పట్టించేందుకు అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంటుకు రూ.2 వేలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసే ప్రైవేటు సంస్థకు ఈ వ్యవస్థను అప్పగిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం అని ఈ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

డేటా అంతా ప్రైవేటు చేతుల్లోకి.. 
ఈ విధానంతో ప్రజల ఆస్తులకు భద్రత అనేదే లేకుండా పోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కుటుంబం తరతరాలుగా కూడబెట్టుకున్న ఆస్తి వివరాలు.. భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, యజమాని వివరాలు, లావాదేవీల చరిత్ర, ఆధార్‌ వంటి వ్యక్తిగత వివరాలు.. ఇవన్నీ ఇకపై లాభాపేక్షతో పని చేసే ప్రైవేటు కంపెనీల సర్వర్లలోకి వెళ్లిపోతాయి.

రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకో, భూ కబ్జాదారులకో ఆ వివరాలు చేరవన్న భరోసా ఏమిటనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ప్రభుత్వ ఆదీనంలో, ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలో డేటా ఉన్నప్పుడే భూ కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్‌  రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఏ ఆస్తి ఎవరిదో, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఏ భూమిపై వివాదాలు ఉన్నాయో.. తదితర సమాచారం మొత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే కబ్జాదారులకు రెడీమేడ్‌ జాబితా అందించినట్లే.  

కబ్జాలకు గేట్లు బార్లా 
తొలి దశలో జిల్లా కేంద్రాల్లోనే ఈ సేవా కేంద్రాలను పెడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్కడే విలువైన భూములు ఉంటాయి. తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర నగరాల్లో భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో గత రెండేళ్లలో రాష్ట్రంలో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు తప్పుడు పత్రాలతో దొంగ  రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కొత్త విధానంలో భూ కబ్జాలకు, డబుల్‌  రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఇచ్చినట్లే. రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగి పోతుంది. విలువైన భూములను టీడీపీ నేతలు వదలకుండా తమ పరం చేసుకుంటున్నారు. వారికి మరింత అవకాశం కల్పించేలా చంద్రబాబు ఈ వ్యవస్థను తీసుకువస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

అప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌పై విష ప్రచారం.. ఇప్పుడు ఆస్తులే ప్రైవేటుకు
వైఎస్‌ జగన్‌ హయాంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. భూ యాజమాన్య హక్కులకు ప్రభుత్వమే శాశ్వత గ్యారంటీ ఇచ్చే ఈ విప్లవాత్మక చట్టంతో భూ వివాదాలకు శాశ్వతంగా తెర పడుతుందని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అండ్‌ కో ఇష్టం వ చ్చినట్లు తప్పుడు ప్రచారం చేసింది. ప్రజల ఆస్తులను జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు దోచుకునేందుకే ఈ చట్టం తెచ్చారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.  

రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ప్రజలకు ఇవ్వరని.. కేవలం జిరాక్స్‌ కాపీలే ఇస్తారని, అంటే మీ ఆస్తులన్నీ జగన్‌ తన వద్ద పెట్టుకుంటాడని అబద్ధాలు ప్రచారం చేశారు. అసలు ఆ చట్టం అమల్లోకి రాకముందే అమలు జరిగిపోయి భూములన్నీ అన్యాక్రాంతమైపోయినట్లు ఊరూ వాడా దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. చివరికి రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఆ చట్టాన్ని అధికారంలోకి వచ్చాక తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రద్దు చేశారు. 

ఇప్పుడు అసలు ట్విస్ట్‌ ఏమిటంటే.. అదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంలో భాగమైన భూముల రీ సర్వేను మాత్రం కొనసాగిస్తూ ఆ చట్టం మంచిదేనని ఒప్పుకోవడం. ఇంతా చేసి ఇప్పుడు ఏకంగా ఆస్తుల  రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే, ప్రజల ఆస్తుల డేటా మొత్తాన్నే ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ గ్యారంటీతో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే చట్టాన్ని ‘నల్ల చట్టం’గా మార్చి.. ప్రజల ఆస్తులను లాభాపేక్ష కలిగిన కంపెనీల చేతుల్లో పెట్టడాన్ని ఏమనాలి?  

రేపటి నుంచి డాక్యుమెంట్‌ రైటర్లు నిరవధిక సమ్మె 
రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది డాక్యుమెంట్‌ రైటర్ల ఉపాధికి తీవ్ర విఘాతం కలగనుంది. ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తాము రోడ్డున పడతామని ఇప్పటికే డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనలు నిర్వహించారు. అయినా ప్రభు­త్వం పట్టించుకోక పోవడంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం లక్ష మంది డాక్యుమెంట్‌ రైటర్ల పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే ప్రైవేట్‌ పరం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement