మహిళను వివస్త్రను చేసి.. టీడీపీ నేత దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ
రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం
చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
బుధవారం ఘటన జరిగితే 3 రోజులు కప్పిపెట్టారు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో చూసి ప్రజలు మీ పాలనను అసహ్యించుకుంటున్నారు
ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు బాబు హడావుడి చేయడం సిగ్గుచేటు
బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేదా?
ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంత వరకు న్యాయం?
బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా?.. పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత?
మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుంది
సాక్షి, అమరావతి : గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని నిప్పులు చెరిగారు.
ఈ దారుణంపై చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ‘ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్?’ అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు?
‘‘గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టారు. చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలను కప్పిపుచ్చే దానిపై శ్రద్ధ చూపే బదులు, బుధవారమే తనపై తొలిసారి దాడి జరిగిన తర్వాత.. బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంత వరకు న్యాయం?ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా.. లేక అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడానికా?
బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
చంద్రబాబు తీరు వల్లే మహిళలకు రక్షణ కరువు
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైన, బాధితులపైన వేధింపులకు.. అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్ పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకు పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు.
ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబు గారూ.. ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుంది’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


