కర్నూలు: అక్క ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆగపల్లి–పెద్దతుండ్ల గ్రామాల మధ్య శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మంచాల సీఐ మధు కథనం ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన బూడిద అరుణ్ (18) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఇటీవల అతని సోదరి ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అరుణ్ ఆగపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆగపల్లి–పెద్దతుండ్ల మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను చనిపోతున్నా.. అక్క ప్రేమ వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’.. అని తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోయపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.


