692 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
రూ.24.27 కోట్ల పరిహారం చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 692 కేసులు పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.24.27 కోట్ల చెల్లింపులు జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ లీసా గిల్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు న్యాయమూర్తి జస్టిస్ రవి నాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సంయుక్తంగా మార్గనిర్దేశం చేశారు. హైకోర్టులో 9 కేసుల పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.49.10 లక్షలు చెల్లించారు. హైకోర్టులో లోక్ అదాలత్ నిమిత్తం రెండు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు.
మొదటి బెంచ్‌కు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, రెండవ బెంచ్‌కు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవ అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో 207 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందికి న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, న్యాయ సేవల కమిటీ కార్యదర్శి మాలతి, న్యాయసేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.


