పైలట్ ప్రాజెక్టులుగా బీచ్ బార్లు
2027 జనవరి నాటికి ఇతర తీరప్రాంత జిల్లాలకు విస్తరణ
సాక్షి, అమరావతి: బీచ్ బార్ల ఏర్పాటు కార్యాచరణను చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది. విశాఖ, చీరాల బీచ్‌లలో బీచ్ బార్లను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో బీచ్ బార్లను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. బీచ్ బార్ల ఏర్పాటుకు విధి విధానాలను ఖరారు చేస్తూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఇక రెండో దశ కార్యాచరణ దిశగా బీచ్‌బార్ల సంఖ్యను సూత్రప్రాయంగా నిర్ణయించింది.
విశాఖ, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద రెండేసి బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో ఒకటి, తొట్లకొండ–రుషికొండ మధ్యలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. చీరాలలో కూడా బీచ్ బార్లకు అనువైన రెండు ప్రదేశాలను గుర్తించింది. ఈ మేరకు త్వరలోనే విడుదల చేయనున్న నూతన మద్యం విధానంలో దీనిని అధికారికంగా ప్రకటించనుంది.
అనంతరం ఈ బీచ్ బార్ల లైసెన్స్ కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈపైలట్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం 2027 జనవరి నాటికే రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న తీరంలో బీచ్ బార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.


