బుడ్డోడి మ్యాజిక్‌కి ఆనంద్‌ మహీంద్ర ఫిదా! వైరల్‌ వీడియో | Nainital Boy Viral Magic Video Anand Mahindra Support | Sakshi
Sakshi News home page

బుడ్డోడి మ్యాజిక్‌కి ఆనంద్‌ మహీంద్ర ఫిదా! వైరల్‌ వీడియో

Jun 6 2026 12:54 PM | Updated on Jun 6 2026 1:08 PM

Nainital Boy Viral Magic Video Anand Mahindra Support

పారిశ్రామికవేత్త,  ఎం అండ్‌  ఎం అధినేత  ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. నిత్యం అనేక ఇన్సిపిరేషనల్‌ కథనాలు, టాలెంట్‌ వీడియోలు, విజ్ఞానాత్మక కథనాలను పంచుకుంటూ ఉండటం ఆయనకు బాగా ఆలవాటు. అంతేకాదు అర్హులైన వారికి చేయూత నందించడం కూడా  పరిపాటి.  ఆయన తాజాగా ఆయన  షేర్‌ చేసిన మట్టిలోమాణిక్యంలాంటి వీడియో ఆసక్తికరంగా మారింది.

ఉత్తరాఖండ్‌లోని అందమైన నైనిటాల్ పట్టణ వీధుల్లో గారడీ చేసే ఓ చిన్నారి ఇంద్రజాలికుడి వీడియోను  తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. బోలెడు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైనమహీంద్రా ఆర్థికంగా అండగా నిలుస్తానని ప్రకటించి మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు.

ఆ వైరల్ వీడియోలో విశేషం ఏమిటంటే  నైనిటాల్‌లోని  ఒక మార్గంలో సాహిల్ అనే బాలుడు వరుసగా వీధుల్లోఅద్భుతమైన మ్యాజిక్ విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తన చేతిలోని కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులతో అతడు చేసే ఇంద్రజాలం చూస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే.  కేవలం రెండు స్టీల్‌ గిన్నెలు,  చిన్న బాల్స్‌ సాయంతో తన చిట్టి చేతులతో అద్భుతమైన వేగంతో కప్పులను అటూ ఇటూ కదుపుతూ అద్భుత నైపుణ్యంతో కనికట్టు చేస్తున్నాడు. అసలా బంతి  ఏ గిన్నె కిందినుంచి అలా అలా మాయమై, ఎలా ప్రత్యక్షమవుతుందో అర్థంకాక  ఆశ్చర్య చకితులవుతారు.

 

ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు

ఆనంద్ మహీంద్రా కూడా అదే అనుభూతికి  లోనయ్యారు. ‘‘ఈ కుర్రాడు ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతను ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లో ఇలాగే ప్రదర్శనలు ఇస్తున్నాడా? ఈ బాలుడికి ఉన్నత చదువులు చెప్పించడంతోపాటు, మ్యాజిక్‌పై అతని ఆసక్తిని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లభిస్తే ఈ బాలుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంద్రజాలికులలో ఒకడిగా ఎదుగుతాడు’’ అంటూ ఈ చిన్నారి గురించి లేదా అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే , వారితో మాట్లాడటానికి, వారికి సాయం చేసేందుకు తనకు సహాయం చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

నెటిజన్లు స్పందన
మహీంద్రా చొరవను మంచి మనసును నెటిజన్లు  ప్రశంసించారు. ఆ బాలుడిని గుర్తించి, అతని చదువుకు సాయం   చేయడానికి మహీంద్రా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. సాహిల్ ,అతని కుటుంబం ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడటానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.

ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్‌ : ట్రంప్‌కి భారీ ఝలక్‌

Advertisement
 
Advertisement
Advertisement