పతనంతిట్ట: కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ వలియ కోయికల్ శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో విషు పండుగ నాడు కలకలం చెలరేగింది. అయ్యప్ప స్వామికి చెందిన పవిత్రమైన బంగారు ఆభరణాన్ని (కానిప్పొన్ను) ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లిన ఘటన అటు భక్తులను, ఇటు ఆలయ అధికారులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. తాను పందళం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తినని నమ్మించి, స్వామివారి సొమ్ముతో ఒక వ్యక్తి పరారుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజ వంశస్థుడినంటూ మోసం
విషు పండుగ సందర్భంగా స్వామివారికి పందళం స్రాంబికల్ ప్యాలెస్ నుంచి తీసుకొచ్చిన 'తిరువాభరణం' అలంకరించారు. బుధవారం ఉదయం 4:30 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఓ భక్తుడు తాను పందళం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తినని అక్కడున్న వారిని నమ్మించాడు. అశ్వవాహనరూఢుడైన అయ్యప్పను ప్రతిబింబించే పవిత్రమైన ‘కానిప్పొన్ను’ (బంగారు కానుక) ఆభరణాన్ని ఆచారంలో భాగంగా కళ్లకద్దుకునే నెపంతో తీసుకున్నాడు. ఆ తర్వాత దానిని గుట్టుచప్పుడు కాకుండా తనతో పాటే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆచారాన్నే ఆసరాగా చేసుకుని..
ఆలయ సంప్రదాయాల ప్రకారం పందళం రాజ కుటుంబ సభ్యులు దర్శనానికి వచ్చినప్పుడు, గర్భగుడిలోని పూజారి స్వయంగా ఈ ‘కానిప్పొన్ను’ను వారికి ఇస్తారు. రాజ వంశస్థులు దానిని తమ కళ్లకు అద్దుకుని, భక్తిని చాటుకోవడం ఒక ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్నే ఆ మోసగాడు ఆసరాగా చేసుకున్నాడు. పవిత్రమైన ఆభరణం చేతికి రాగానే, కళ్ళకద్దుకుంటున్నట్లు నటించి ఎవరికీ అనుమానం రాకుండా ఆ బంగారంతో జారుకున్నాడు.
సీసీటీవీ దృశ్యాలతో ముమ్మర దర్యాప్తు
సాధారణంగా విషు ప్రత్యేక దర్శనం ఉదయం 9 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆభరణాలను తిరిగి పందళం ప్యాలెస్‌కు సురక్షితంగా తరలిస్తారు. అయితే ఈ లోపే ఈ అనూహ్య ఘటన జరగడంతో ఆలయ దేవస్వం బోర్డు అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్వామివారి ఆభరణం చోరీకి గురైనట్లు గుర్తించిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు, అధికారులు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తూ, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఏ క్షణాన్నైనా సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల.. చెక్ చేసుకోండిలా..


