లండన్: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన వార్తా సంస్థగా పేరొందిన ‘బీబీసీ’ మునుపెన్నడూ లేని విధంగా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్ధిక కష్టాలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ దిగ్గజ సంస్థ, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. దశాబ్ద కాలంలో బీబీసీ తీసుకున్న అత్యంత కఠినమైన, అతిపెద్ద లేఆఫ్స్ నిర్ణయం ఇదే కావడం గమనార్హం.
ఆర్థిక లోటు.. భారీగా కోతలు
ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వాణిజ్య ఆదాయం, లైసెన్స్ ఫీజులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో బీబీసీ తన వార్షిక బడ్జెట్‌లో దాదాపు 10 శాతం ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో ఈ 2,000 ఉద్యోగాల కోతలను అమలు చేయనుంది. 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రభావం పూర్తిగా కనిపించనుంది. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి టాల్ఫన్ డేవిస్ ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేస్తూ, సంస్థ ముందున్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావా
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్న వేళ, బీబీసీకి భారీ చట్టపరమైన చిక్కులు తోడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జనవరి ఆరున క్యాపిటల్ దాడికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుదోవ పట్టించేలా ఎడిటింగ్ చేసిందని ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 93,359.43 కోట్లు) పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం కారణంగానే గత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో వచ్చే నెలలో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బ్రిట్టిన్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రశ్నార్థకంగా మారిన మనుగడ
1922లో స్థాపించిన బీబీసీకి ప్రధాన ఆదాయ వనరు వీక్షకులు చెల్లించే వార్షిక లైసెన్స్ ఫీజు . అయితే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో ప్రజల వీక్షణ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా కుటుంబాలు సాంప్రదాయక టీవీలకు దూరమవుతుండటంతో బీబీసీ ఆర్థిక నమూనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రిటన్ లేబర్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ లైసెన్స్ ఫీజు విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, బహుళ టీవీ, రేడియో ఛానెళ్లు నడుపుతున్న బీబీసీ భవిష్యత్తు మనుగడపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి: ఖరగ్‌పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు?


