టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్? | Vijay's Crop Loan Waiver Promise Hits RBI Roadblock | Sakshi
Sakshi News home page

టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?

Apr 16 2026 9:08 AM | Updated on Apr 16 2026 9:25 AM

Vijay's Crop Loan Waiver Promise Hits RBI Roadblock

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడిలో టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రకటించిన రైతుల రుణమాఫీ హామీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ఆయన ప్రకటన అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బృహత్తర హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే దానిపై సహకార శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సహకార బ్యాంకుల విలవిల
విజయ్ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సహకార బ్యాంకులు కేవలం తమ సొంత నిధులతో నడవవని, అవి ‘నాబార్డ్’ నుంచి రుణాలు తీసుకుని, ప్రజల డిపాజిట్లను ఉపయోగించి రైతులకు అప్పులు ఇస్తాయని వారు వివరిస్తున్నారు. రుణమాఫీ వల్ల కేవలం పేద రైతులకే కాకుండా సంపన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

బ్యాంకులపై పెనుభారం
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ ప్రకటించిన వెంటనే సహకార సంఘాలకు ఆ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించదు. ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తుంది. దీనివల్ల సహకార సంస్థలు తీవ్ర ఆర్థిక అగాధంలో కూరుకుపోతాయి. ఒకపక్క ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తూనే, తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి వాటిపై పడుతుంది. ఈ జాప్యాల వల్ల రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద తగిన నిధులు ఉండవని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్బీఐ కఠిన నిబంధనలు
ఈ సమస్యలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఇప్పుడు కీలకంగా మారాయి. రుణమాఫీ పరిహారాన్ని ప్రభుత్వాలు వాయిదాల్లో కాకుండా 45 నుంచి 60 రోజుల్లోపు ఒకేసారి చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాలకు,  రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించిన మీదటనే అధికార డీఎంకే కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని చేర్చలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్

Advertisement
 
Advertisement
Advertisement