‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్ | Cash for Votes Mamata Slams Nirmala Over 3K Poll Gimmick | Sakshi
Sakshi News home page

‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్

Apr 16 2026 9:51 AM | Updated on Apr 16 2026 10:00 AM

Cash for Votes Mamata Slams Nirmala Over 3K Poll Gimmick

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత వేడెక్కింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు  తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించి, మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ)డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఓటర్లకు నిర్భయంగా లంచం
తాజాగా బీజేపీ నేతలు పంపిణీ చేసిన ‘మాతృశక్తి గ్యారెంటీ కార్డుల’ చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ కార్డుల ద్వారా మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.3,000 జమ చేస్తామని బీజేపీ పరోక్షంగా హామీ ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య నిబంధనలను అపహాస్యం చేస్తూ, ఓటర్లకు బహిరంగంగా లంచం ఇవ్వడమేనని ఆమె మండిపడ్డారు. పోలింగ్‌కు ముందే ఆదరాబాదరాగా కొత్త ఖాతాలు ఎందుకు తెరుస్తున్నారని, ఇదంతా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ఓటు బ్యాంకు జిమ్మిక్కు మాత్రమేనని ఆమె ఆరోపించారు.

ఈసీ నిష్పాక్షికతపై దీదీ ప్రశ్నల వర్షం
ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి  తప్పుబట్టారు. ఈసీ కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే ఉక్కుపాదం మోపుతోందని, అధికార బీజేపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. అందరికీ చట్టం సమానమే అయినప్పుడు, బీజేపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రధాని పదవిపై తనకు అపార గౌరవం ఉందని, అయితే ప్రజలను ఇలా బహిరంగంగా తప్పుదోవ పట్టిస్తుంటే తాను మౌనంగా ప్రేక్షకపాత్ర పోషించలేనని  మమత అన్నారు. ఆర్థిక మంత్రిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఉత్కంఠ రేపుతోన్న బెంగాల్ పోరు
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తమవి కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన పరిపాలనా పరమైన హామీలే తప్ప, ఎలాంటి ఎన్నికల ప్రలోభాలు కావని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త వివాదం ఓటర్ల మనోభావాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ  రాజకీయ పోరులో అందరి దృష్టి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మీదే నిలిచింది.

ఇది కూడా చదవండి: టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?

Advertisement
 
Advertisement
Advertisement