సీనియర్లను విస్మరించి... సన్నిహితులకు అందలం | Political Twists On TDP Over Nara Lokesh As Working President | Sakshi
Sakshi News home page

సీనియర్లను విస్మరించి... సన్నిహితులకు అందలం

Apr 16 2026 7:50 AM | Updated on Apr 16 2026 8:38 AM

Political Twists On TDP Over Nara Lokesh As Working President

టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌  

టీడీపీ కమిటీలపై స్వపక్షం నుంచే విమర్శలు  

మంత్రులు, ఎమ్మెల్సీ పదవులు ఆశించే వారికి పార్టీ పదవులతో సరి

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటించిన కమిటీల పట్ల సొంత పార్టీలోనే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్‌ చేసుకోవడమే లక్ష్యంగా కమిటీల కూర్పు చేసినట్టుగా స్పష్టమవుతోంది. ఊహించినట్టుగానే మంత్రి లోకేశ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ తన చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్వహిస్తుండడం పట్ల పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో ఏకంగా జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారు.

గతేడాది మేలో జరిగిన మహానాడు సందర్భంగా ప్రకటించాల్సిన ఈ కమిటీలను ఏడాదిపాటు నానుస్తూ బుధవారం ప్రకటించారు. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో లోకేశ్‌తోపాటు ఆయన సన్నిహితులకు పెద్ద పీట వేయడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా లోకేశ్‌ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే వారికి కీలక పదవులు కట్టబెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కిలారి రాజేష్‌కు కట్టబెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేశ్‌ సన్నిహితుడు సానా సతీష్‌కు పార్టీ అధికారంలోకి రాగానే రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. త్వరలో ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పార్టీలో కీలకమైన జాతీయ ఉపాధ్యక్ష పదవిని సైతం సతీష్‌కు కట్టబెట్టారు.  

అప్రాధాన్య పదవులపై సీనియర్లలో అసంతృప్తి  
రాష్ట్ర అధ్యక్ష పదవిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మరోసారి కట్టబెట్టారు. మరోవైపు తమకు అప్రాధాన్య పదవులు కట్టబెట్టారన్న అసంతృప్తి పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. గతంలో పొలిట్‌బ్యూరోతోపాటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని అధికార ప్రతినిధిగా పరిమితం చేశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సోమిరెడ్డితోపాటు బొండా ఉమా, కూన రవి కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావు వంటి వారికి పార్టీలో అప్రాధాన్య పదవులు కట్టబెట్టడం ద్వారా వారిని మంత్రి పదువుల రేసు నుంచి తప్పించారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

మరోవైపు నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు, బుద్దా వెంకన్న, చింతకాయల విజయ్, పరుచూరి అశోక్‌బాబు, పీతల సుజాత, భాష్యం రామకృష్ణ వంటి వారికి పార్టీ పదవులతో సరిపెట్టి పక్కన పెట్టారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన పిడుగురాళ్ల  మాధవికి పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వక పోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement