కరాకస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అగ్రరాజ్యం చేతిలో బందీ అయిన తర్వాత ఆ దేశ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దేశంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోందని, వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో డిమాండ్ చేశారు. మదురో పతనం తర్వాత వెనిజులా భవిష్యత్తు ఎటువైపు వెళుతుందనే ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
రాజ్యాంగ సంక్షోభం దిశగా..
నికోలస్ మదురోను అమెరికాకు తరలించి మూడు నెలలు దాటినా, ఇప్పటికీ వెనెజువెలాలో స్పష్టమైన నాయకత్వం లేదు. పాత ప్రభుత్వంతో సంబంధం ఉన్న తాత్కాలిక అధికారులే పాలన సాగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారికి ప్రజల తీర్పు లేదని, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా మాత్రమే దేశంలో చట్టబద్ధమైన పాలన నెలకొంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. పారదర్శకమైన అధికార బదిలీకి రోడ్‌మ్యాప్ లేకపోవడంతో వెనెజువెలాలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
30 రోజుల గడువు దాటింది
వెనెజువెలా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానం శాశ్వతంగా ఖాళీ అయితే 30 రోజుల్లోగా తిరిగి ఎన్నికలు జరగాలి. కానీ ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన విశ్లేషణలు, రాజకీయ మంతనాలు ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఎప్పటినుంచో రాజీలేని పోరాటం చేస్తున్న మచాడో... తాజా పరిస్థితుల నేపథ్యంలో తన గళాన్ని మరింత పెంచారు. నాయకత్వ లేమిని భర్తీ చేసే ఏకైక మార్గం తక్షణ ఎన్నికలేనని ఆమె స్పష్టం చేశారు.
భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ
ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అంతర్గత రాజకీయ విభేదాలకు తోడు, అంతర్జాతీయ ఒత్తిళ్లు కూడా వెనెజువెలా ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మదురో ఆధిపత్యం అనంతరం చట్టబద్ధమైన పాలన కోసం జరుగుతున్న ఈ పోరాటం... వెనెజువెలా భవిష్యత్తును నిర్ణయించే ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది.
ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’


