బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’ | Bengal 2026 Gen Z to Decide the Ultimate Battle | Sakshi
Sakshi News home page

బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’

Apr 15 2026 7:43 AM | Updated on Apr 15 2026 8:40 AM

Bengal 2026 Gen Z to Decide the Ultimate Battle

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం(2026) మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. యువత భవిష్యత్ ఆలోచనల మధ్య సాగుతున్న మహా సంగ్రామం. ఈ చరిత్రక ఎన్నికల్లో గెలుపోటములను శాసించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు ‘జెన్ జెడ్’ చేతుల్లోనే ఉంది. మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత.. కుల, మత, వారసత్వ రాజకీయాలకు అతీతంగా, తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి రావాలా లేదా బీజేపీ నేతృత్వంలోని ‘పరివర్తన్ 2.0’కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు  ఈ తరం యువత చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

సంక్షేమ పథకాలే టీఎంసీకి శ్రీరామరక్ష
తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ‘కన్యాశ్రీ’, ‘సబుజ్ సాథి’ వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వారి విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే, బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు మక్కువ ఎక్కువ. దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నది వారి భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి ‘జెన్ జెడ్’ ఓటర్లు.. పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వీరు సోషల్ మీడియా ప్రభావంతో, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు.

‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే..
పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో.. బెంగాల్ యువత  ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ 'పరివర్తన్ 2.0' నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.

‘సీఈఓ’ లాంటి లీడర్ కావాలి
నేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకీ కట్టుబడి ఉండలేదు. వారు పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగభరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక బహుళజాతి కంపెనీని నడిపించే ‘సీఈఓ’ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలి. ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను యువత కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్‌ వీడియో
 

Advertisement
 
Advertisement
Advertisement