టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.
ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యం
ఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్‌గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.
సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని.. ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్‌గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
స్ట్రైక్‌రేటు మరీ దారుణం
కాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్‌రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్‌పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 11, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.
ఇంగ్లండ్‌లో విఫలమతే అంతే సంగతులు
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్. అయితే, బ్యాటర్‌గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్ టూర్‌లో అతడే కెప్టెన్.
అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు.
ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.


