బీజేపీకి ఝలక్‌.. స్టాలిన్‌ వినూత్న నిరసన | CM Stalin burns copy of Delimitation Bill against Centre | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఝలక్‌.. స్టాలిన్‌ వినూత్న నిరసన

Apr 16 2026 9:28 AM | Updated on Apr 16 2026 9:38 AM

CM Stalin burns copy of Delimitation Bill against Centre

చెన్నై: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రం తీరు పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.

పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, డీలిమిటేషన్​ బిల్లు పేపర్లను కాల్చివేశారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా స్టాలిన్‌.. ‘ఈ ప్రతిఘటన తమిళనాడు అంతటా వ్యాపించాలి! ఫాసిస్ట్ బీజేపీ అహంకారం కూలిపోవాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.

అంతేకాకుండా.. గత హిందీ వ్యతిరేక ఆందోళనలతో పోలుస్తూ.. గతంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రతిఘటన ఢిల్లీని లొంగిపోయేలా చేసిందని, అటువంటి ఉద్యమమే ప్రస్తుత ప్రతిపాదనను సవాలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు తమిళులను వారి సొంత భూమిలో శరణార్థులుగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేయడానికి ఈ ఆందోళన ద్రావిడ భూమి అంతటా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు.. డీఎంకే ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి నేడు పార్లమెంట్‌ సమావేశంలో పాల్గొననున్నారు.

ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండగా, ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement