న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన ప్రకటన వెలువడింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్థానిక ధనవంతులపై పన్నుల బాదుడు ప్రారంభించారు. నగర చరిత్రలోనే తొలిసారిగా బడాబాబుల ఖాళీ ఇళ్లపై ‘పైడ్-ఎ-టెర్రే’ (pied-a-terre tax) పేరిట భారీ పన్నును విధించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సామాన్యులకు అండగా నిలిచే ఈ నిర్ణయం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.
సంపన్నుల ఖాళీ ఇళ్లపై..
న్యూయార్క్‌లో ఐదు మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41 కోట్లు) కంటే ఎక్కువ విలువగల విలాసవంతమైన ఇళ్లను పెట్టుబడి కోసమే ఉంచే వారిపై ఈ కొత్త పన్ను పడనుంది. నగరంలోని ఐదు ప్రాంతాలలో దాదాపు 13 వేల ఇళ్లు ఈ కొత్త పన్ను పరిధిలోకి వస్తాయని మేయర్ అంచనా వేశారు. 2019లో 238 మిలియన్ డాలర్లతో హెడ్జ్ ఫండ్ సీఈఓ కైన్ గ్రిఫిన్ కొన్న అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్ లాంటి భవనాలు ఈ పన్నుకు అసలైన లక్ష్యమని మమ్‌దానీ ఉదహరించారు.
Happy Tax Day, New York. We’re taxing the rich. pic.twitter.com/Wky2LFXC9W
— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) April 15, 2026
500 మిలియన్ డాలర్ల ఆదాయమే లక్ష్యం
మేయర్ బాధ్యతలు చేపట్టిన మూడున్నర నెలల్లోనే జోహ్రాన్ మమ్దానీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన పన్ను విధానం ద్వారా నగరానికి ప్రతియేటా కనీసం 500 మిలియన్ డాలర్ల భారీ ఆదాయం(రూ. 4,666.82 కోట్లు) సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలా వచ్చిన నిధులను సామాన్య ప్రజల కోసమే వెచ్చించనున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లలకు ఉచిత చైల్డ్ కేర్ సేవలు, పరిశుభ్రమైన వీధులు, సురక్షితమైన కాలనీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సంపన్నులకిదే మా ట్యాక్స్ డే
‘న్యూయార్క్ వాసులకు హ్యాపీ ట్యాక్స్ డే.. మనం ధనవంతులపై పన్నులు విధిస్తున్నాం’ అని మమ్దానీ ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉండే ఇళ్లతో పేద, పని చేసే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ విధానానికి ఇక చెక్ పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఈ ఆలోచనను తొలుత వ్యతిరేకించిన న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ సైతం ఇప్పుడు దీనికి సంపూర్ణ మద్దతు పలికారు.


