98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..! | Nani Who Began Selling Gujarati Snacks At 98 Goes Viral | Sakshi
Sakshi News home page

98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!

Apr 15 2026 11:06 AM | Updated on Apr 15 2026 11:19 AM

Nani Who Began Selling Gujarati Snacks At 98 Goes Viral

కష్టపడటానికి, తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా నిలబడటానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు చాలామంది వృద్ధులు. సంకల్పం, ఆత్మశ్వాసం ఉంటే అందంగా లైఫ్‌ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ బామ్మ అదే నిరూపించింది. ఆమె అప్పటి వరకు భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా సాగిన జీవితంలోకి అకస్మాత్తుగా చీకట్లు ఆవరించాయి. అయితేనేం బామ్మ వెంటనే తేరుకుని ఆ దుఃఖాన్ని కూడా అందంగా మధురంగా మార్చుకుంది. అదెలాగంటే..

ఆ బామ్మే అహ్మదాబాద్‌కు చెందిన 98 ఏళ్ల ప్రభావతి భగవతి. విశ్రాంతి తీసుకునే వయసులో ఆమె వ్యాపారవేత్తగా ఫుడ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అది తెలుకోవాలంటే..ముందుగా ఆమె కథేంటో తెలుసుకోవాల్సిందే. 1927లో జన్మించిన ప్రభావతి తన భర్త ప్రఫుల్ భగవతితో సుదీర్ఘకాలం సంతోషంగా జీవించారు. ఆ దంపతులు దాదాపు 68 ఏళ్ల పాట్లు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించారు. 

కానీ 2017లో భర్త భగవతి మరణంతో అంతా మారిపోయింది. ఆమె ఇల్లు నిశబ్దంగా మారి, వంటగది వెలవెలబోయినట్లు అనిపించింది. ఆమె పిల్లలు వేరేచోటే స్థిరపడటంతో మనవళ్లు, మనవరాళ్లు పెద్దవాళ్లైపోవడంతో తాను వండిపెట్టడానికి ఎవరు లేకుండా పోయారు. ఆమె చక్కటి వంటకాలు వండి పెడుతూ తన ప్రేమను వ్యక్తపరిచే ఆమెకు అది మరింత లోటుగా అనిపించింది. అప్పుడే ఊహించని ఓ సంఘటన జరిగింది. 

ఒక సాధారణ టీ విందులో ఎవరో ప్రభావతి బామ్మ చేసిన ఖాండ్వీ రుచిని చూసి ముగ్ధలయ్యారు. దాంతో వాళ్లు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్‌ కోసం చేయమని పట్టుబట్టడమే కాకుండా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. మొదట్లో ప్రభావతి అందుకు అంగీకరించలేదు. కానీ వాళ్ల బలవంతంపై అంగీకరించక తప్పలేదు. అలా ఆమె తొమ్మిది పదుల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. 

ఒక ఆర్డర్‌తో మొదలైంది కాస్తా.. త్వరలోనే అనేక ఆర్డర్లుగా మారింది. ప్రజలు ఆమె వంటను ఇష్టపడటమే కాదు దానితో మమేకమయ్యారు. అలా 2019లో “నానిస్ నాష్టా” అనే ఫుడ్‌ స్టాల్‌ మొదలైంది. అందుకు పెద్ద ఏర్పాటు, మార్కెటింగ్‌ బృందం వంటివి గానీ ఏమిలేవు. అలాగే ఆ ఫుడ్‌ స్టాల్‌కి కనీసం ప్రమోషన్స్‌కూడా లేవు. కేవలం ప్రభావతి బామ్మ తన ఇంటి వంటగదిలో ప్రేమతో వంటకాలు చేసేవారు. 

ఆమె గుజారాతీ రుచుల తోపాటు ముంబై స్ట్రీట్‌ ఫుడ్‌ క్లాసిక్స్‌, వడాపావ్‌, సేవ్‌పూరీ, ధోక్లా, తేప్లా, భాక్రీ, పావ్‌ భాజీ తదితర రుచికరమైన వంటకాలెన్నో అందిస్తుంది. వీటన్నింటిలోనూ ‍ప్రసిద్ధి ఆకర్షణ ఖాండ్వీ ఉంటుంది. ఈ వంటకం కారణంగానే ఆ బామ్మ ఫుడ్‌ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఈ బామ్మ సుమారు 200కు పైగా కుటుంబాలకు వంట చేస్తున్నారు. 

అంతేగాదు 'నానిస్ నాష్టా' వ్యవస్థాపకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది. అప్పటిదాక దూకుడుగా ఉన్నమనం తొమ్మిది పదులకు చేరుకునేలోపు నెమ్మదిగా, విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ బామ్మ అలాంటి మూసధోరణికి స్వస్తి చెప్పి..వ్యక్తిగతంగా ఎదుగుతున్న తీరు అందరికీ ఆదర్శం.  

(చదవండి: ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌గా..! ఎలాగో తెలుసా..?)

 

Advertisement
 
Advertisement
Advertisement