గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్నారు. 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఏప్రిల్ 18, 2026న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ఘనత సాధించారామె. ఈ పోటీలు మరపురాని ప్రదర్శనలను అందించడమే కాకుండా, భారతదేశపు కొత్త అందాల రాణికి కిరీటాన్ని కట్టబెట్టాయి. రజనీగంధ పెర్ల్స్ సహకారంతో KIIT భువనేశ్వర్ సమర్పించిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేడుకలో, ఫెమినా మిస్ ఇండియా గోవా, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్నారు.
ఇక సాధ్వి సతీష్ సైల్ ఒక మోడల్, సామాజిక కార్యకర్త. ఆమె పిల్లలు, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు సేకరణతో సహా అర్థవంతమైన కార్యక్రమాలకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు. అంతేగాదు ట్రెండ్‌రీల్స్ నుంచి ఫిట్‌నెస్ అప్‌డేట్‌ల వరకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి ప్రతిదీ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా వినికిడి, మాటల లోపాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి తీవ్రంగా కట్టుబడి ఉన్నారు.
ఇక ఫైనల్ పోటీల్లో సాధ్వి డిజైనర్ లేబుల్ వాజనే రూపొందించిన, వెండి రంగు మెటాలిక్ పూసల పనితో కూడిన హాల్టర్-నెక్, శరీరానికి అతుక్కుపోయే గౌనును ధరించారు. కిరీటం దగ్గర సగం ముడివేసిన సాధారణ కేశాలంకరణతో జత చేసిన చెవిపోగులు ఆమె రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఆమె అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు సాధ్వి మాట్లాడుతూ..సామాన్య పట్టణం నుండి వచ్చి, విదేశాల్లోని ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టినప్పుడు,తనసొంత ఆలోచన విధానమే ప్రధాన అడ్డంకిగా నిలిచింది.
ఇతరుల అద్భుత విజయాలు తనలో సందేహాలు కలిగించి తన కలల సాహసాన్ని చేరుకోలేనోమో అనే భయాన్ని పెంచేసేవి అని చెబుతోంది. అయితే ఈ భయాల నుంచి బయటపడి, ఇతరులతో తనను పోల్చుకోవడం మానేసి, మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తనను స్ట్రాంగ్‌గా మార్చాయని అంటోంది.
ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే దాని స్థితిస్థాపకత, పట్టుదల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమేగాక, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. కాగా, ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర 2026 రజనందిని పవార్ మొదటి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫెమినా మిస్ ఇండియా యూనియన్ టెరిటరీ 2026 డాక్టర్ శ్రీ అద్వైత రెండవ రన్నరప్‌గా నిలిచారు.
(చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)


