ఫలితం పదిపోకుండా.. | - | Sakshi
Sakshi News home page

ఫలితం పదిపోకుండా..

Feb 27 2026 10:51 AM | Updated on Feb 27 2026 10:51 AM

ఫలితం పదిపోకుండా..

ఫలితం పదిపోకుండా..

గ్రేటర్‌ పరిధిలో టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్‌ పరిధిలో పది ఫలితాల్లో వెనుకబాటుకు చెక్‌ పెట్టేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం ‘వంద శాతం ఉత్తీర్ణత’ లక్ష్యంగా ‘టార్గెట్‌.. టెన్త్‌’ పేరుతో విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామీణ జిల్లాలు ఫలితాల్లో దూసుకుపోతుంటే, అత్యాధునిక వసతులున్న నగర పరిధిలోని జిల్లాలు మాత్రం వెనుకబడి ఉండటంపై ఆయా యంత్రాంగాలు సీరియస్‌గా తీసుకున్నాయి.

మూడు విభాగాలుగా..

పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధన కోసం విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పాస్‌ మార్కులు సాధించడంలో ఇబ్బంది పడే వెనుకబడిన విద్యార్థులకు కనీస అభ్యసన సామగ్రితో పాటు శిక్షణ, సగటు మార్కులతో ఉత్తీర్ణులయ్యే వారిని పై తరగతికి చేర్చేలా ప్రోత్సాహం, ప్రతిభావంతులైన విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించేలా ఉన్నత స్థాయి ప్రశ్నపత్రాలతో సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ్లలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాల విశ్లేషణ, నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తోంది.

జిల్లా 2025 2024 2023 2022

హైదరాబాద్‌ 88.53 86.76 80.92 79.63

రంగారెడ్డి 87.84 91.01 87.35 90.04

మేడ్చల్‌–మల్కాజిగిరి 90.76 89.61 90.72 86.31

గత ఏడాది ఇవీ స్థానాలు..

మహా హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు పదో తరగతిలో నాలుగేళ్ల నుంచి వెనుకబాటు తప్పడం లేదు. గతేడాది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌ 30 వ స్థానం, మేడ్చల్‌–మల్కాజిగిరి 28 వ, రంగారెడ్డి జిల్లా 31వ స్థానానికి దిగజారాయి.

Advertisement
 
Advertisement
Advertisement