ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెంది విద్యార్థిని 23 ఏళ్ల నవ్య నీలకుడిటి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గతేడాది మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమె అమెరికా వెళ్లారు. జీవితం స్థిరపడుతుందని ఆశపడుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
మిచిగాన్‌లో ఒక ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా పిట్స్‌బర్గ్‌లో నవ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్‌బర్గ్‌లోని UPMC ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న ఆమె మరణించారు.
నవ్య భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఆసుపత్రి ఖర్చుల కోసం టెక్సాస్‌లో నివస్తున్న ఆమె సమీప బంధువు శిరీష నీలకుడిటి నిధుల సేకరణ (Fundraising) చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 85వేల డాలర్లు పైగా సాయం అందింది. నవ్య తల్లిదండ్రులు సాధారణ రైతులు. కుమార్తె ఉన్నత చదువుకోసం తమ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశపడిన ఆమె కలలు ఆవిరై పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.
కాగా ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో విషాదకర సంఘటనలో, 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు మిస్సౌరీలో మరణించారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న హరికృష్ణ, ఏప్రిల్ 11న తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చదువుకుని ఉన్నత స్థితికి చేరుతారనుకున్న బిడ్డలు ఇలా విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!


