వృత్తిలో ఎదుగుదల లేదా? చాలీచాలని జీతంతో సతమతమవుతున్నారా? అయితే అమెరికాకు చెందిన ఈ సీనియర్ జర్నలిస్ట్ కథ మీకోసమే.. 30 ఏళ్ల పాటు పత్రికా రంగంలో పనిచేసిన ‘జిమ్ లెక్సా’ తన 53వ ఏట తీసుకున్న ఓ నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. జర్నలిజం వదిలేసి ఓ సాధారణ పోస్ట్‌మెన్‌గా మారిన అతను ఇప్పుడు ఏకంగా తన పాత జీతం కంటే మూడు రెట్లు అధికంగా సంపాదిస్తూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
పత్రికా రంగంలో కష్టాలు.. తగ్గిన జీతం
1984లో టెక్సాస్‌లో స్పోర్ట్స్ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించిన జిమ్ లెక్సా, అంచెలంచెలుగా ఎదిగి, డెస్క్ బాధ్యతలు చేపట్టాడు. అయితే తదనంతర కాలంలో వార్తాపత్రికల మనుగడ కష్టంగా మారడంతో ఆ రంగంలో సంక్షోభం మొదలైంది. దీంతో అతని జీతం భారీగా తగ్గిపోయింది. కిరాణా సరుకులు కొనేందుకు, కనీసం పెంపుడు జంతువుల వైద్య ఖర్చులకు కూడా డబ్బులు సరిపోక ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తక్కువ జీతం, నిరంతర డెడ్‌లైన్ల ఒత్తిడితో విసిగిపోయిన జిమ్, 2015లో తన జర్నలిజం వృత్తికి శాశ్వతంగా స్వస్తి పలికాడు.
పోస్ట్‌మెన్‌గా కొత్త జీవితం.. మూడింతల ఆదాయం
జర్నలిజం వదిలేశాక ఇల్లినాయిస్‌లో పెయింటింగ్, క్లీనింగ్ వంటి పనులు చేసిన ఆయన.. అదే ఏడాది యూఎస్ పోస్టల్ సర్వీస్‌లో క్లర్క్‌గా చేరాడు. అతి తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, న్యూయార్క్‌లో ఫుల్-టైమ్ లెటర్ క్యారియర్‌గా (పోస్ట్‌మెన్) ప్రమోషన్ పొందాడు. ప్రస్తుతం తన పాత జీతం కంటే దాదాపు మూడు రెట్లుకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇప్పుడు భార్యతో కలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వీలైనప్పుడు విహారయాత్రలు చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు.
ఆర్థిక స్థిరత్వంతో పాటు అద్భుతమైన ఆరోగ్యం
ఈ వృత్తి మార్పు జిమ్ లెక్సాకు కేవలం ఆర్థిక స్థిరత్వాన్నే కాదు.. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది. పోస్ట్‌మెన్‌గా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రతిరోజూ 12 నుంచి 18 మైళ్ల దూరం (దాదాపు 40,000 అడుగులు) నడుస్తున్నాడు. దీంతో 63 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, ఉల్లాసంగా ఉన్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ఒత్తిడి, ఆకర్షణీయమైన జీతం, మంచి ప్రయోజనాలు.. వెరసి తన నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని నిరూపించాయని జిమ్ గర్వంగా చెబుతున్నాడు.
ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్?


