వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ తో తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. ‘ఇరాన్ వ్యవహారం పూర్తయిన తర్వాత క్యూబా వైపు వెళ్తాం’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో గుబులు రేపుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓవల్ ఆఫీస్ బయట ఆయన చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యలు.. అమెరికా తదుపరి లక్ష్యం క్యూబానేనా అనే తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి.
ఇరాన్ తర్వాత క్యూబాపై గురి
ప్రస్తుత ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత అమెరికా దృష్టి క్యూబాపై పడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ వెలుపల మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ.. ‘ఇరాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగియగానే తాము క్యూబా వ్యవహారాన్ని చూసుకుంటామని’ ఆయన పేర్కొన్నారు. దీనిపై శ్వేతసౌధం నుంచి ఎలాంటి అధికారిక వ్యూహం కానీ, సైనిక చర్యల కచ్చితమైన సమయం కానీ వెలువడకపోయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి.
దారుణమైన పాలన.. విఫల దేశం
క్యూబా దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిందని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దానిని ఒక ‘విఫల దేశం’గా అభివర్ణించిన ఆయన, పాత కాస్ట్రో శకంలో జరిగిన పరిపాలనా లోపాలను ఎత్తిచూపుతూ.. ఆ దేశం ఎన్నో ఏళ్లుగా అత్యంత దారుణమైన పాలనలో ఉందని అన్నారు. అమెరికా విదేశాంగ విధానంలో క్యూబా ఎప్పుడూ ఒక ప్రత్యేక అంశంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన ట్రంప్, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్దిష్ట దౌత్య లేదా ఆర్థిక చర్యల గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉత్కంఠ
1959 నాటి క్యూబా విప్లవం, ప్రచ్ఛన్న యుద్ధం సమయం నుంచి అమెరికా-క్యూబా మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిబంధనల వంటివి నేటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అదీ ఇరాన్ వ్యవహారంలో ప్రపంచం అట్టుడుకుతున్న వేళ, ట్రంప్ క్యూబా పేరును ప్రస్తావించడం గ్లోబల్ మార్కెట్లలో, లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది. ప్రస్తుతానికి క్యూబా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా, ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్‌మ్యాన్‌గా మారి..


