సూర్య దేవభూమి చాలెంజ్‌కు జిల్లా యువకుడి అర్హత
113 కిలో మీటర్ల రేస్‌కు రెడీ.. 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహణ
భారత సైన్యం ఆధ్వర్యంలో సాహస యాత్ర
జనగామ : హిమాలయాల్లో జరగనున్న సూర్య దేవభూమి చాలెంజ్ 2.0లో భాగంగా బద్రీనాథ్–కేదార్‌నాథ్ మార్గంలో 113 కిలోమీటర్ల హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్‌కు జనగామ జిల్లా చీటకోడూరు గ్రామానికి చెందిన యువ అథ్లెట్ ఐతరాజు నరేశ్ అర్హత సాధించారు. భారత సైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కఠిన ఎండ్యూరెన్స్ రేస్‌లో పాల్గొంటూ నరేశ్ భవిష్యత్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అల్ట్రా ట్రైల్‌డు మౌంట్ బ్లాంక్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ (ఐటీఆర్‌ఏ) గుర్తింపు పొందిన ఈవెంట్లలో పాయింట్లు సాధిస్తూ, అంతర్జాతీయ వేదికపై భారత ప్రతినిధిగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్నాడు.
113 కిలో మీటర్లకు రెడీ..
దేశంలో అత్యంత కఠిన అల్ట్రా రన్నింగ్ ఈవెంట్లలో ఒకటైన ‘సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0’ను ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్వహించనున్నారు. బద్రీనాథ్–కేదార్‌నాథ్ మార్గంలో జరిగే ఈ హై ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్ మొత్తం 113 కిలోమీటర్ల దూరం కవర్ చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా ఎంపికైన రన్నర్లు పాల్గొంటుండగా, జనగామ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ ఐతరాజు నరేశ్ కూడా ఈ సవాల్‌ను స్వీకరించనున్నారు.

భారత సైన్యం ఆధ్వర్యంలో..
ఈ ఈవెంట్‌ను భారత సైన్యం ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ టూరిజం సహకారంతో నిర్వహిస్తున్నారు. సైనికులు, సాధారణ పౌరులు కలిసి పాల్గొనే ఈ రేస్ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జీరో ప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ విధానాలతో ఈ పోటీని నిర్వహించడం విశేషం. కాగా, సాహసం, ఫిట్‌నెస్, దేశభక్తి కలయికగా నిలిచే ఈ రేస్‌లో నరేశ్ ప్రతిభ చాటాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
యాత్రకు ఆర్మీ సహకారం
సూర్యదేవ భూమి 2.0లో సత్తా చాటేందుకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయ్యా. యూటీఎంబీ లక్ష్యంగా ముందుకు సాగుతా. మా సాహస యాత్రకు ఇండియన్ ఆర్మీ పూర్తి సహకారం అందిస్తుంది. 113 కిలో మీటర్ల యాత్రకు సంబంధించి పూర్తి రూట్ మ్యాప్ పంపించారు. ఈ నెల 13 మధ్యాహ్నం వరకు రన్ నిర్వహించే ప్రదేశానికి చేరుకుంటా. లక్ష్యం చేరుకుని జనగామ జిల్లా పేరును మరింత ఇనుమడింపజేస్తా- ఐతరాజు నరేశ్, సూర్య దేవభూమి చాలెంజ్‌కు ఎంపికైన జిల్లా వాసి


