బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్! | BJPs Mega Manifesto Free LPG | Sakshi
Sakshi News home page

బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!

Apr 14 2026 1:04 PM | Updated on Apr 14 2026 1:37 PM

BJPs Mega Manifesto Free LPG

చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

మహిళలకే అగ్రపీఠం
బీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ  సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.

జల్లికట్టుకు జై
విద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.

రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త  ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement