చెన్నై: ఆధ్యాత్మికతకు, చారిత్రక వారసత్వానికి చిరునామా అయిన మైలాపూర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అధికార డీఎంకే బలం, మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళిసై సౌందరరాజన్ దూకుడుతో ఈ ‘టెంపుల్ టౌన్’లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అసలైన శక్తి మాత్రం మహిళా ఓటర్లే.
‘లేడీ పవర్’ ఎవరి వైపు?
మైలాపూర్‌లో పురుషుల కంటే మహిళలే అధికం అని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2,70,568 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,39,349, పురుష ఓటర్లు 1,31,179. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తమిళిసైకి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక వైద్యురాలిగా, మాజీ గవర్నర్‌గా ఆమెకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇంటింటి ప్రచారంలో మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కమలం వికసిస్తుందా?
గత చరిత్రను చూస్తే మైలాపూర్ ఏ పార్టీకీ శాశ్వత చిరునామా కాదు. 2016లో అన్నాడీఎంకేను ఆదరించిన ప్రజలు 2021లో డీఎంకే అభ్యర్థి ధా వేలుకు పట్టం కట్టారు. ప్రస్తుతం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ధా.వేలుపై వ్యతిరేకత ఉందా? లేక పి.వెంకటరమణన్ (టీవీకే), ఆర్ఎల్ అరుణ్ అయ్యంగార్ (ఎన్‌టీకే)లు ఓట్లను చీల్చుతారా? అన్నది పక్కన పెడితే.. తమిళిసై మాత్రం ‘మహిళా శక్తి’ మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మహిళా ఓటర్లు కరుణిస్తే మైలాపూర్ గడ్డపై కమలం వికసించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బహుముఖ పోరులో ఉత్కంఠ
తత్వవేత్త తిరువళ్లువర్ జన్మించిన ఈ పవిత్ర నేలపై తనదైన ముద్ర వేయాలని తమిళిసై గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే మైలాపూర్ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? ఈ ‘టెంపుల్ టౌన్’ పోరులో చివరకు విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్?


