రైల్వే ట్రాక్‌ల పొడవునా రెండు వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ
రూ.3 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్న వైనం
ప్రాణ నష్టం నివారణ.. పరిహారం చెల్లింపు సమస్యకు చెక్
ప్రజల్లో క్రమశిక్షణ లోపించిన నేపథ్యంలో నిర్ణయం
నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌లు దాటుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న జనం
దీనికి అడ్డుకట్ట వేసేందుకు 4,019 ట్రాక్ కి.మీ మేర ఇనుప కంచె నిర్మిస్తున్న ఎస్‌సీఆర్
అక్కడక్కడా ప్రహరీ గోడలు.. సబ్ వేలు అదనం
ఇందుకయ్యే వ్యయంతో 30 వందేభారత్ రైళ్లు తయారు చేయవచ్చనే అభిప్రాయం
వందల కి.మీ. నిడివితో కొత్త రైల్వే రూట్ రూపొందించేందుకూ అవకాశం
కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకునేందుకు వాటి చుట్టూ కంచె నిర్మించుకోవటం సాధారణ విషయమే. కానీ రైల్వే శాఖ ఇప్పుడు వేల కోట్లు వెచ్చించి కంచె నిర్మిస్తోంది. అయితే ఇది ఏదో ఆస్తులను కాపాడుకునేందుకు కాకుండా, ప్రజల్లో లోపించిన క్రమశిక్షణ ఫలితంగా చేస్తున్న వృ«థా ఖర్చు కావడం గమనార్హం. ఈ కంచె కోసం ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగానే వ్యయం కానుండగా.. అవే డబ్బులు వెచ్చిస్తే 30 వందేభారత్ రైళ్లు తయారవడం లేదా వందల కి.మీ. నిడివి ఉండే కొత్త రైల్వే రూట్ రూపొందే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైల్వే కారిడార్లు జనావాసాలు, వ్యవసాయ పొలాలు, అడవుల మీదుగా సాగుతాయన్న విషయం తెలిసిందే. చెరువు కట్టలాగా ఎత్తుగా ఉండే రైలు మార్గం, అక్కడి ప్రాంతాన్ని రెండుగా విభజిస్తుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు దాన్ని దాటేందుకు నిర్మాణ సమయంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తుంది. పశువులు దాటేందుకు కూడా వీలుంటుంది. కానీ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా ఎక్కడ కుదిరితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ దాటుతున్నారు. చివరకు వంతెనలు ఉన్న చోట కూడా రైలు మార్గం మీదుగా దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు ఢీకొట్టడంతో ఎంతో మంచి చనిపోతున్నారు. ముఖ్యంగా వేల సంఖ్యలో జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు ఇది రైల్వేకు పెద్ద సమస్యగా మారింది. చనిపోయిన మనుషులు, జంతువుల ప్రాణాలకు విలువ కట్టి పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్రాక్ పొడవునా రెండు వైపులా కంచె నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. ఇప్పటికే కొంతపని పూర్తి కాగా, మిగతా ప్రాంతాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
ప్రహరీ గోడలు..ఇనుప కంచెలు
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు ఢీకొట్టడం వల్ల అధిక సంఖ్యలో వన్యప్రాణులు చనిపోతున్నాయి. గుజరాత్‌లో సింహాలు, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఏనుగులు సైతం మరణిస్తున్నాయి. ఆయా జంతువులు వేగంగా అంతరించే జంతువుల జాబితాలో ఉండటంతో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి, కానీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపుగా అలాంటి పరిస్థితి లేదు. వన్య ప్రాణులకు రైళ్లతో పెద్దగా సమస్య లేదు. కానీ ఇక్కడ పశువులు ఎక్కువగా చనిపోతున్నాయి. దూరాభారాన్ని తగ్గించుకునే క్రమంలో నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు లాంటి మూగ జీవాలను పట్టాల మీదుగా తరలిస్తుండటంతో అవి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటే సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా ప్రహరీ గోడలే నిర్మిస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. కాలి బాటలు ఉన్న చోట్ల సబ్‌వేలను నిర్మిస్తున్నారు.
ఆ మార్గాలపై ప్రత్యేక దృష్టి...
ఇటీవల పలు ప్రధాన రైలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచారు. ఆ మేరకు ట్రాక్‌ను పటిష్టం చేశారు. వేగంగా వెళ్లే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా వాటి సంఖ్య క్రమంగా పెంచుతున్నారు. కొత్తగా వందేభారత్ స్లీపర్ కేటగిరీ రైళ్లు కూడా పట్టాలెక్కబోతున్నాయి. వీటి వేగం ఎక్కువగా ఉంటున్నందున, ట్రాక్ సామర్థ్యాన్ని కూడా ఆ మేరకు పెంచాల్సి ఉంది. రైళ్ల వేగం పెరిగే కొద్దీ నిర్లక్ష్యంగా ట్రాక్ దాటే వారికి ప్రమాదం జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. రెప్పపాటులో రైలు దూసుకొచ్చినప్పుడు తప్పించుకునే చాన్స్ తక్కువగా ఉంటుంది. 
కొన్ని సందర్భాల్లో రైళ్లు పట్టాలు తప్పేందుకు కూడా ఇది కారణమవుతుంది. అప్పుడు రైళ్లలోని ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురవుతారు. ఎంత చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటటాన్ని జనం వదులుకోవటం లేదు. ఈ నేపథ్యంలోనే.. 4,019 ట్రాక్ కి.మీ. మేర ఇనుప కంచె, 410 కి.మీ. మేర ప్రహరీ గోడలు నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టింది. కంచె కోసం రూ.2,056 కోట్లు, ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.1,136 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే 875 కి.మీ. నిడివిలో కంచె నిర్మించగా, దానికి ఈ కొత్త ప్రణాళిక అదనం కావటం విశేషం. 
ట్రాక్ వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచె
రైల్వేని కుదిపేసిన అస్సాం ఘటన
ఇటీవల అస్సాంలో రైలు ఢీకొని ఒకేసారి ఏడు ఏనుగులు చనిపోవటం రైల్వేను కుదిపేసింది. ఇప్పుడు ట్రాక్ చుట్టూ కంచె నిర్మాణం వేగవంతం కావటానికి ఇది ప్రధాన కారణంగా మారింది. ఇక తరచూ మనుషులు చనిపోవటం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే భద్రత చర్యల కోసం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు వ్యయం చేస్తుండగా, ఇందులో దేశవ్యాప్తంగా కంచె, ప్రహరీ గోడల నిర్మాణానికి దాదాపు రూ.23 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు పరచటం, రైళ్లు పరస్పరం ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం, ట్రాక్‌ను పటిష్టం చేయటం, అండర్‌పాస్‌లను నిర్మించటం లాంటివి భద్రత చర్యల్లో భాగం. ఇవన్నీ అత్యవసరమైనవే కానీ ట్రాక్‌కు ఇరువైపులా కంచెల నిర్మాణం మాత్రం చాలావరకు ప్రజల నిర్లక్ష్యం ఫలితంగానే చేపట్టాల్సి వస్తోంది.
ఎస్‌సీఆర్ పరిధిలో కంచె పనులు ఇలా.. 
గుజరాత్‌లో సింహాలు ప్రమాదాలకు గురికాకుండా, అస్సాం లాంటి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను కాపాడేందుకు, ఇతర టైగర్ రిజర్వ్‌లలో పులులు సహా ఇతర వన్యప్రాణులు ప్రమాదాలకు గురికాకుండా కంచె నిర్మాణం అవసరం. కానీ మనుషులు, వారు పెంచుకునే పశువులు ప్రమాదాలకు గురికావడానికి మాత్రం స్థానిక ప్రజల నిర్లక్ష్యం, అజాగ్రత్తే కారణం. వాస్తవానికి ట్రాక్‌ను ఎక్కడ దాటాలో స్పష్టంగా సూచిస్తూ అందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అండర్ పాస్‌లు, రైల్వే గేట్లు లాంటివి ఇందులో భాగమే. కానీ ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ ట్రాక్‌లు దాటేస్తున్నారు.
-గౌరీభట్ల నరసింహమూర్తి


