అల్లూరి సీతారామరాజు జిల్లా: సాధారణంగా రైల్వే ట్రాక్‌పై ఒక రైలు వస్తుంటేనే వాహనదారులు, ప్రయాణికులు ఎంతో జాగ్రత్తగా గమనిస్తుంటారు. అలాంటిది ఒకేచోట పక్కపక్క ట్రాక్‌లపై రెండు రైళ్లు ఒకేవైపు వెళ్తూ ఏకకాలంలో కనిపిస్తే ఆ ఉత్కంఠే వేరు. శుక్రవారం డుంబ్రిగుడ రైల్వే గేటు సమీపంలో ఇలాంటి అరుదైన దృశ్యమే స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయేమోనని మొదట కొందరు ఆందోళన చెందినప్పటికీ.. తీరా చూస్తే అవి రెండూ రైల్వే విభాగానికి చెందిన ప్రత్యేక వాహనాలని అర్థమైంది. అందులో ఒకటి ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం కాగా, మరొకటి విద్యుత్ లైన్ల తనిఖీ కోసం వాడే రైలు. ఈ రెండు రైళ్లు పక్కపక్కనే ఉన్న పట్టాలపై ప్రయాణించడంతో ప్రయాణికులు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అమ్మో రెండు రైళ్లా!.. అని కంగారు పడినవారు, అవి పని నిమిత్తం వెళ్తున్న వాహనాలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.


