పాతికేళ్ల యువకుడికి దీర్ఘకాల కిడ్నీవ్యాధి
తల్లిదండ్రుల అనారోగ్యంతో కిడ్నీ ఇవ్వలేని పరిస్థితి
ఏఎన్‌యూ ఆస్పత్రిలో విజయవంతంగా కిడ్నీమార్పిడి
హైదరాబాద్, సాక్షి : ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రిలో 25 ఏళ్ల యువకుడికి ఆయన చిన్నాన్న ఇచ్చిన కిడ్నీని విజయవంతంగా మార్చారు. కిడ్నీ మార్పిడి కేసులలో సొంత బంధువులు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుందనీ జన్యుపరమైన సానుకూలతల కారణంగా కుటుంబంలోంచి ఎవరైనా కిడ్నీ దానం ఇస్తే అది బాగా విజయవంతం అవుతుందనీ ఏఐఎన్‌యూ వెల్లడించింది.
కోనసీమ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు.. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి అతడికి తలనొప్పి, వాంతులు తరచు అవ్వడం మొదలైంది. ఏంటా అని వైద్యులకు చూపించుకుంటే సీరం క్రియాటినైన్ బాగా పెరిగిందని రక్తపరీక్షల్లో తేలింది. మరిన్ని పరీక్షల అనంతరం.. అతడికి దీర్ఘకాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉందని తెలిసింది. దీంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులను సంప్రదించాడు. సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి ఆధ్వర్యంలో చికిత్స అందించి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా ముగించారు.
సాధారణంగా ఇంత చిన్న వయసులో ఎలాంటి దురలవాట్లు లేనివాళ్లకు ఇలాంటి సమస్యలు రావడం అరుదు. కానీ, రోగనిరోధక శక్తి కారణంగా కొన్నిసార్లు ఇలా కావచ్చని వైద్యులు తెలిపారు. మరోవైపు కిడ్నీని దానం చేసేందుకు తల్లిదండ్రుల రక్తం గ్రూపులు ఆ యువకుడి గ్రూపుతో కలవలేదు. దానికితోడు వారి ఆరోగ్య పరిస్థితులు కూడా దానానికి అనుగుణంలేదు. దీంతో అతడి చిన్నాన్న ముందుకు రావడంతో లాపరోస్కొపిక్ పద్ధతిలో కిడ్నీ సేకరించి, దాన్ని యువకుడికి అమర్చామని డా. శ్రీకాంత్ వివరించారు.
చిన్నప్పటి నుంచి ఉన్న బంధంతోనే..
ఇంతకుముందు తనకెలాంటి సమస్య లేదు, చెడు అలవాట్లు కూడా లేవని యువకుడు తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి అప్పుడప్పుడు వాంతులు, తలనొప్పి రావడంతో వైద్యులను సంప్రదించానని చెప్పారు. కిడ్నీ మార్పడి అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. అమ్మానాన్నల నుంచి కిడ్నీ తీసుకోలేని పరిస్థితి ఉండడంతో, తన పరిస్థితి చూసి చలించిపోయి బాబాయ్ కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చారన్నారు. మా పిన్ని, వాళ్ల పిల్లలు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దాంతో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. బాబాయ్ పూర్తిగా కోలుకుని పని చేసుకుంటున్నారు. నాకు కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని ఆ యువకుడు చెప్పాడు.
యూరాలజీ రోబోటిక్ సర్జరీ, యూరో-ఆంకాలజీ, రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ, నెఫ్రాలజీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, మహిళల యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, పురుషుల ఆరోగ్యం, ఆండ్రాలజీ. భారతదేశంలో యూరలాజికల్ శస్త్రచికిత్సలలో విశేష సేవలందిస్తోందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ గురించి విభాగం వెల్లడించింది.


