భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ పరిపక్వత దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ విపణి విస్తరిస్తుందని పేర్కొంది.
ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్(ఎల్‌పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్‌పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, టౌన్‌షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గుర్‌గావ్‌లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్‌కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి.
లగ్జరీ యూనిట్లకు ఆసక్తి..
2021 నుంచి దేశంలో లగ్జరీ హౌసింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో లగ్జరీ గృహాల సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు 14 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది.


